పనితీరులో మార్పు రాదా?

17 Dec, 2016 02:35 IST|Sakshi
 ఏలూరు సిటీ : నెల రోజుల్లో ఏడుగురికి మాత్రమే మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయిస్తారా? 14 సార్లు స్వయంగా చెప్పినా పనితీరులో మార్పులేదు. మండలంలో ఒక్కరికే రూపే కార్డు ఇప్పించారు.. ఇలా అయితే ఎలా? పనిచేయమంటే మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారే తప్ప నేను చెప్పిన పనిచేయకపోతే నాకు మనోభావాలు ఉండవా? అంటూ చింతలపూడి ఎంపీడీవో రాజశేఖర్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఎంపీడీవోల సమావేశంలో నగదురహిత లావాదేవీలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇతర మండలాల్లో ఎంసీసీఐ మ్యాపింగ్‌ వందల సంఖ్యలో జరుగుతుంటే ఒక్క చింతలపూడిలోనే కేవలం సింగిల్‌ డిజిట్‌తో ఉండటం చూస్తే ఎంపీడీవో పనితీరుకు అద్ధం పడుతోందని కలెక్టర్‌ చెప్పారు. ఉదయం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఒక మహిళ ఫోన్‌ చేసి చింతలపూడి ఎంపీడీవో అసలు ఆఫీసుకే రారని వచ్చినా సరైన సమాధానం చెప్పరని ఫిర్యాదు చేసిందన్నారు. 18 వేల ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణం, తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలో ఫీల్డ్‌ చానల్స్‌ తవ్వకం, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే రాబోయే రెండు నెలల్లో రూ.60 లక్షల పనిదినాలు కల్పించడం కష్టం కాదన్నారు. 
ఇది నా జిల్లానే : కలెక్టర్‌
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని చెబుతున్నారే తప్ప మరోవిధంగా తాము భావించడం లేదని, అయితే ఎంపీడీవోలంతా ఒకే స్థాయిలో పనిచేయాలని చెప్పడం వల్ల కొన్నిచోట్ల వీక్‌నెస్‌ వల్ల ఆశించిన మేరకు పనులు జరగడం లేదని, మా జిల్లా అభివృద్ధికి మేము కష్టపడతామని ఎంపీడీవో పరదేశికుమార్‌ చెప్పగా కలెక్టర్‌ స్పందిస్తూ ఇది నా జిల్లానే.. నేను కలెక్టర్‌గా పనిచేసే అవకాశం పశ్చిమలో కలిగిందని, తన స్వస్థలం పక్క జిల్లా అయినప్పటికీ యాధృచ్చికంగా పశ్చిమలో పనిచేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 315 కిలోమీటర్లు మాత్రమే సీసీ రోడ్లు వేసుకున్నామని, మరో 400 కిలోమీటర్లు పొడవునా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసుకోవడానికి కష్టపడమంటే బాధపడితే ఎలా? అని కలెక్టర్‌ ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌.అమరేశ్వరరావు పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు