ఉత్సవాలకు వాహనాలు కరువు !

30 Sep, 2016 20:17 IST|Sakshi
ఉత్సవాలకు వాహనాలు కరువు !
  • ముచ్చటగా మూడే !
  • కనిపించని రోజుకో వాహనం 
  • ముందుకుసాగని తయారీ పనులు 
  • పట్టించుకోని అధికారులు 
  • వేములవాడ : తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన వేములవాడలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏటా రూ.70కోట్ల ఆదాయం వస్తున్న ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపునకు వాహనాలు కరువయ్యాయి. దేవీ, గణేశ్‌ నవరాత్రోత్సవాలు, రాజన్న బ్రహ్మోత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నా..రథాల తయారీలో నిర్లక్ష్యం వీడడం లేదు. నందివాహనం, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉండగా  హంస, నెమలి, అశ్వవాహనాలను మాత్రమే ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. 
    వాహనాలేవి?
    ప్రతి ఉత్సవంలో ఆలయంలోని శ్రీపార్వతీసమేత రాజరాజేశ్వరస్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో పెద్దసేవలపై ఊరేగిస్తుంటారు. రోజుకో వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించాల్సి ఉంటుంది.  కానీ మూడే వాహనాలను వినియోగిస్తున్నారు. శనివారం పదకొండు రోజుల పాటు దేవినవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పదకొండు రోజులు మూడు వాహనాలతోనే గడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హంస, నెమలి, అశ్వవాహనాలనే ఉపయోగిస్తున్నారని మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నంది, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉన్నట్లు పూజల విభాగం సిబ్బంది చెప్పడం గమనార్హం. 
    అటకెక్కిన వెండి వాహనాల తయారీ
    ఏటా నిర్వహించే ఉత్సవాలకు వెండి వాహనాలను తయారు చేయించాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి. నిత్యం ప్రత్యేక పూజల అనంతరం పురవీధుల్లో నిర్వహించే ఉత్సవాలకు సరైన వాహనాలు ఉపయోగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. తక్షణమే వెండి వాహనాలు తయారు చేయించాలని రాజన్న భక్తులు కోరుతున్నారు. గతంలో వెండి వాహనాల తయారీకి సంబంధించిన అంశంలో పలువురు కోర్టు చుట్టూ తిరగడం, కేసుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి అధికారుల్లో భయం రేకొల్పుతోంది. గతంలో వెండి సమకూర్చుకునే క్రమంలో ఈవో స్థాయి అధికారితోపాటు పది మంది వరకు కోర్టు చుట్టూ తిరిగారని, సీబీసీఐడీ విచారణకు వెళ్లి వచ్చారన్న భయం వెంటాడుతోంది.  
    ప్రణాళికలు పంపడమే!
    ఉత్సవాల సమయంలో వాహనాల అంశం తెరపైకి రావడంతోనే దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రణాళికలు పంపడంతోనే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి ఏటా దాటవేసే ధోరణే కనిపిస్తుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.  
     
    వాహనాలను రిపేర్‌ చేయిస్తాం
    అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్న క్రమంలో మరో రెండు వాహనాలు అవసరం ఉంటుంది. నంది, గరత్మంతుడి వాహనాలను రిపేర్‌ చేయిస్తాం. ఇక వెండి వాహనాల అంశం కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాలతోనే వెండి వాహనాలు తయారు చేసేందుకు పనులు చేపడతాం. ప్రస్తుతం ఉత్సవాలకు మూడు వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం.
    – దూస రాజేశ్వర్, ఆలయ ఈవో
     
     
మరిన్ని వార్తలు