ఆలయాలకు ఆదరణేదీ?

20 Jul, 2016 01:56 IST|Sakshi
కృష్ణానది మధ్యలో ఉన్న శివలింగం, నందీ విగ్రహం
 మాగనూర్‌ మండలానికి రాష్ట్రంలోనే విశిష్టమైన స్థానం ఉంది.. అప్పట్లో రాజులు, సంస్థానాధీశులు ఏలారు.. ఆదిమానవులు, రుషులు నడయాడారు.. ముఖ్యంగా ఆలయాలు, నదులతో  చరిత్రలోనే ప్రసిద్ధికెక్కింది.. ఇలాంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.. దీనికి అధికారుల అవాగాహన రాహిత్యమే కారణమని స్థానికులు, భక్తులు ఆరోపిస్తున్నారు.
 
 మాగనూర్‌ : ఒకవైపు కృష్ణానది మొట్టమొదట ఈ మండలంలోని తంగిడిలో ప్రవేశించి 22 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. మరోవైపు భీమానది కుసుమర్తిలో ప్రవేశించి మూడు కిలోమీటర్లు ప్రవహించి తంగిడి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నదులు ప్రవహిస్తున్న ఈ తీర ప్రాంతాల్లో ఎంతో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. కుసుమర్తి వద్ద కృష్ణ ద్వయిపాయనస్వామి పేరిట మఠం ఉంది. ఈయన మంత్రాలయం గురురాఘవేంద్ర మహాస్వాములకు ముందే ఈ ప్రాంతంలో తపస్సును ఆచరించారు.  
   
    కృష్ణా, భీమానదులు కలిసే సంగమ క్షేత్రంలో  ఎందరో రుషులు ఇక్కడ తపస్సును ఆచరించినట్లు ఆధారాలున్నాయి. నది అటువైపు కర్ణాటక ప్రాంతంలో సంగమేశ్వర ఆలయం ఉంది. అక్కడ ఇప్పటికీ ఈ ప్రాంత విశిష్టతను తెలియజేసే శిలా శాసనాలు ఉన్నాయి. ఇటువైపు ఐదేళ్లక్రితం దత్త పీఠాధిపతి విఠల్‌బాబా, భీమా శంకర ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని గుర్జాల్‌ వద్ద నది మధ్యలో బండపై  శివలింగం, నందీ విగ్రహాలు ఉన్నాయి. అవి కదిలిస్తే కదులుతాయి కానీ నది ప్రవాహానికి మాత్రం ఇంచైనా జరగవని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో నది ఒడ్డునే సిద్ధలింగ మహాస్వాములు తపస్సును ఆచరించి మఠం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అక్కడ పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం నిర్వహిస్తుంటారు.  
 
   మరో రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణా వద్ద నది ఒడ్డున దత్తత్రాయ మందిరం, శివాలయం ఉన్నాయి. ఇక్కడ రుషులు తపస్సును ఆచరించారు. వీరిలో క్షీరలింగేశ్వర మహాస్వాములు ఒకరు. ఆయన శిష్యులు ఏటా మకర సంక్రాంతి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామం నది ఒడ్డున ఉన్నందునా కృష్ణగా పిలుస్తున్నారు. ఇక్కడ బ్రిటిష్‌వారు తమ వ్యాపార విస్తరణకు 1870లోనే వంతెన నిర్మించి రైలు సౌకర్యం కల్పించారు. జిల్లాలోనే కృష్ణ మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ కావడం విశేషం. ఐదు కిలోమీటర్ల దూరంలోని ముడుమాల్‌లో మంత్రాలయ రాఘవేంద్రస్వాములు, ఆయన సమకాలికులైన గురు యాదవేంద్ర మహాస్వాములు తపస్సును ఆచరించారు. ఏటా ఫిబ్రవరి 22న ఈయన ఆరా«ధనోత్సవాలు నిర్వహిస్తుంటారు.
     మరో ఐదు కిలోమీటర్ల దూరంలో కొల్పూర్‌ వద్ద సత్యపూర్థ తీర్థ మహాస్వాముల మఠం ఉంది. 
రాజ్యాలు, సంస్థానాధీశుల ప్రాంతం
ముడుమాల్‌లో రాజుల సంస్థానాలు ఇప్పటికి ఉన్నాయి. మాగనూర్‌ మండలంలోని గ్రామాలతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు గ్రామాలు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొల్పూర్‌ సంస్థానంలో రాజులు నది అటువైపు ఉన్న కర్ణాటక ప్రాంతాలతోపాటు ఇటువైపు ఉన్న కొన్ని గ్రామాలను పరిపాలించారు. ఇప్పటికీ రాజమందిరాలు ఉన్నాయి. వీరి వంశికులే ప్రస్తుతం కర్ణాటకలోని దేవసూగూర్‌ సూగురేశ్వర ఆలయం నిర్మించారు. ఈ రాజులకు చెందిన లక్షలాది ఎకరాలను ఆచార్య వినోభాబావే స్వచ్ఛందంగా సేకరించి, పేదలకు  పంపిణీ చేశారు.
ఆదిమానవుల నిలువురాళ్లు 
ముడుమాల్‌లో నది ఒడ్డున ఉన్న నిలువురాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసినట్టు పురవాస్తు శాఖ ప్రొఫెసర్‌ పుల్లారావు పరిశోధన ద్వారా తేలింది. ఆది మానవులు రుతువులను తెలుకునేందుకు వాటిని ఏర్పాటు చేసుకున్నారని, సూర్యకిరణాలు ఓ వరుస నుంచి మరో వరుసకు ప్రయాణించే సమయాన్ని వారు రుతువులుగా భావించేవారు. ఇక్కడ పుష్కరఘాట్లు నిర్మించకపోవడం తగదని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. కృష్ణ పుష్కరాలలోపు ఆలయాలను అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు.  
 యాదవేంద్రస్వామి మఠం వద్ద..
 గురుయాదవేంద్ర మహాస్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు. మంత్రాలయ పీఠాధిపతులు, కర్ణాటకలోని ఉడిపి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు ఇలా ఎందో ఇక్కడికి వస్తుంటారు. వారికి ఇబ్బందులు కలగకుండగా నదిలో ఘాట్లు ఏర్పాటు చేయాలి. మిగతా సమయాల్లోనూ వేలాదిమంది భక్తులు నది స్నానాలకు వస్తుంటారు. అధికారులు కుంటిసాకులతో కాలయాపన చేయకుండా ఈ ప్రాంతాల్లో ఘాట్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
 
 
మరిన్ని వార్తలు