ఆదెరువు..ఆగం

29 Aug, 2016 00:09 IST|Sakshi
మిడ్జిల్‌లో వాన లేక ఎండిపోతున్న మొక్కజొన్న పంట
  •  ఆగస్టులో చినుకు రాలని వాన
  •  వేలాది ఎకరాలలో పంటలకు నష్టం
  •  అన్నదాత విలవిల 
  • జిల్లాలోని వివిధ మండలాల్లో కరువు కరాళ నత్యం చేస్తోంది.. సరైన వర్షాలు కురియక వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లింది.. వరుసగా రెండేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల నుంచి తేరుకోక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న  రైతన్నకు, ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో కురిసిన వర్షాలు ఊరటనిచ్చినా ఆ తర్వాత మొహం చాటేశాయి.. దీంతో రైతులు విలవిలలాడుతున్నారు.
     
    మిడ్జిల్‌ : ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు మండలంలో మొక్కజొన్న 60వేల ఎకరాల్లో, పత్తి 20వేల ఎకరాల్లో, కంది ఐదు వేల ఎకరాల్లో, వరి ఇతర పంటలు మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేశారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 74మి.మీ.కుగాను 84మి.మీ. కురియడంతో రైతులు ఎంతో సంతోషించారు. జూలైలో సాధారణ వర్షపాతం 123మి.మీ.కుగాను కేవలం 20మి.మీ. మాత్రమే కురిసింది. ఆగస్టులో 113మి.మీ. కురియాల్సి ఉండగా నేటికీ చినుకు జాడలేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది 30శాతం పంట దిగుబడి రాగా, ఈసారి పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
     
     
    ఆశలన్నీ..డియాసలే!
     
    నవాబుపేట : ఆరుతడి పంటలు వేసి ఈసారి అప్పులు తీర్చుకుందామనుకున్నా అన్నదాతకు ఖరీఫ్‌ కాస్తా షాక్‌ ఇచ్చింది. పంటలు వేయగానే ఏపుగా పెరగటంతో ఇక పంటలు బాగా పండుతాయనుకున్న తరుణంలో వరుణుడు కాస్తా మెహం చాటేశాడు. దీంతో రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. మండలంలో సుమారు పదివేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. వీటిలో మొక్కజొన్న 8,447హెక్టార్లు, జొన్న 548హెక్టార్లు, రాగి 34హెక్టార్లు, కంది 653హెక్టార్లలో వేశారు. చాలా చోట్ల మొక్కజొన్న ఎండిపోయింది. పంట బాగా దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.1,300 ప్రభుత్వ మద్దతు ధర ఉంటే ఎకరాకు 20క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. ఈ లెక్కన వర్షాభావం కారణంగా ఈసారి మొక్కజొన్నకు రూ.53కోట్లు, ఇతర పంటలు రూ.ఏడు కోట్ల వరకు నష్టపోయే అవకాÔ¶ ముంది. వరి విషయానికి వస్తే మండలంలో 739 హెక్టార్లలో వేశారు. ఇది కాస్తా నెర్రెలు వారటంతో సగానికిపైగా నష్టపోయే అవకాశం ఏర్పడింది. 
     
    ష్టాలు తప్పడంలేదు
     
    మాగనూర్‌ : అన్నదాతలకు ఈసారి కష్టాలు తప్పడంలేదు. మాగనూర్‌ మండలంలో వరి రెండు వేల ఎకరాల్లో, పత్తి 7,215ఎకరాల్లో, ఆముదాలు 5,634ఎకరాల్లో, కందులు 16,556ఎకరాల్లో, పెసర 642ఎకరాల్లో, మినుములు 37ఎకరాల్లో సాగుచేశారు. 25రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంటలన్నీ ఎండుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభంలో ఏకధాటిగా వర్షాలు కురియడంతో చాలా వరకు ఆముదం పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు ఎకరానికి సుమారు రూ.పదివేల చొప్పున పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పత్తి పూత, పిందే దశలో; మరికొన్ని గ్రామాల్లో నెల రోజుల మొక్కలు ఉన్నాయి. ఓ మోస్తరుగా పెరిగినా వర్షం కురియకపోవడమేగాక ఎర్రతెగులు సోకింది. దీంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి దాపురించింది.  
    పంటంతా ఎండిపోయింది
    గత నెలలో కురిసిన తొలకరి వర్షాలకు మొక్కజొన్న పంట సాగు చేశాం. ఆ తర్వాత యూరియా వేయడంతో పంట వేపుగా పెరిగింది. అయితే 50రోజుల నుంచి వాన లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. 
    – ప్రసాద్, రైతు, ఊర్కొండ      
                                                                    
    విచారణ జరుపుతున్నాం
    మండలంలో వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం.
    – కష్ణకిశోర్, ఏఓ, మిడ్జిల్‌ 
     
     
     
     
     
     
మరిన్ని వార్తలు