డయాలసిస్‌కు నోఎంట్రీ

20 Jul, 2016 02:43 IST|Sakshi
తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రి

– స్విమ్స్‌లో కిడ్నీ రోగులకు చేదు అనుభవం
–బెడ్లు లేవంటూ తిరస్కరిస్తున్న వైద్యాధికారులు
– రోగులను పంపొద్దంటూ ప్రయివేట్‌ హాస్పిటల్స్‌కు ఆదేశాలు
– అధికారుల తీరుపై ఇబ్బంది పడుతున్న కిడ్నీ రోగులు

   స్విమ్స్‌లో కిడ్నీరోగులకు ప్రవేశం లేదా..ఇక్కడికి వారు రాకూడదా.. డయాలసిస్‌ చేసుకునే వారు.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసుకుందామనుకునే వారు వస్తే నిరాశే ఎదురవుతుందా ..ఈ ప్రశ్నలకు స్విమ్స్‌ వైద్యుల తీరు చూస్తే ఔననే సమాధానం వస్తుంది. ‘ మా ఆసుపత్రికి డయాలసిస్‌ రోగులను ఎవ్వరినీ పంపవద్దు’ అంటూ సాక్షాత్తూ స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ తిరుపతిలోని పలు ప్రయివేట్‌ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్‌ వైద్యసేవ నిధుల విడుదలలో జాప్యం..పడకల కొరత కారణంగా వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 తిరుపతి మెడికల్‌ :
డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా కిడ్ని రోగులకు డయాలసిస్‌ చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.   స్విమ్స్‌ ఆసుపత్రితో పాటు నగరంలోని ప్రయివేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకు ఈ పథకం తొలిరోజుల్లో కాసులు కురిపించింది. రాన్రానూ సర్కారు నుంచి ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కిడ్నీరోగులు వస్తే ప్రయివేట్‌ ఆస్పత్రులు స్విమ్స్‌కు రిఫర్‌ చేసేస్తున్నాయి. కనీసం స్విమ్స్‌లోనైనా వైద్యమందుతుందని డయాలసిస్‌ రోగులు వెళ్తే అక్కడా వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బులు ఖర్చుపెట్టుకుంటామంటే ఎమెర్జెన్సీలో చేరండి..ఎన్‌టిఆర్‌ పథకమైతే రుయా ఆసుపత్రికి వెళ్లండంటూ సూచిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. కాదు కూడదని రోగులు మొండికేసి స్విమ్స్‌లోనే డయాలసిస్‌ చేసుకుంటామంటే ‘బెడ్లు ఖాళీగా లేవు, డయాలసిస్‌ చేయాలంటే ఎక్కువ కాలం పడుతుందని కలవరపెడుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న రోగులకు మాత్రమే డయాలసిస్‌ చేసుకుంటూ ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారన్న ఆరోపణలు వున్నాయి.
 ప్రయివేట్‌ ఆసుపత్రులకు నోటీసులు...
          తిరుపతిలో 8 ప్రయివేట్‌ డయాలసిస్‌ సెంటర్లున్నాయి. ఈ సెంటర్లలో డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా డయాలసిస్‌ చేసుకునే సౌకర్యం కల్పించింది. పథకం ద్వారా రోగులకు ప్యాకేజి కింద డయలసిస్‌కు ఒక సిటింగ్‌కు రూ.1250 చొప్పున నెలలో 25 రోజులకు 10 సిట్టింగ్‌లకు రూ.12,500 ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్యాకేజీల వల్ల నెలలు తరబడి బిల్లులు రావడం లేదని, అప్పులు మిగులుతున్నాయంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎవరైతే ఎక్కువ చెల్లిస్తారో వారికే  ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరంతా రోగులను నేరుగా స్విమ్స్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. అలా వచ్చిన వారికి తామెందుకు వైద్యం అందించాలి..  బెడ్లు లేవు అంటూ స్విమ్స్‌ వైద్యులు తిప్పి పంపేస్తున్నారు. అదేమంటే డయాలసిస్‌ అత్యవసరంగా అందించకుంటే ప్రమాదమని మెళిక పెడుతున్నారు. అందుకే తరలించవద్దంటూ.. ఏదైనా ఉంటే నేరుగా సంప్రదించాలంటూ నగరంలోని అన్ని కార్పొరేట్, ప్రయివేట్‌ ఆసుపత్రులకు స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ సర్యులర్‌ను జారీ చేశారు.

నోటీసుల వెనుక కారణం...
       పలమనేరుకు చెందిన జయమ్మ (54)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. స్విమ్స్‌కు వస్తే ఈమెను చేర్చుకోలేదు. ఆసుపత్రి బయట ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్దనే పడిగాపులు కాసి నాలుగవ రోజు మతి చెందింది. దీంతో మతురాలి బందువులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని స్విమ్స్‌ వైద్యాధికారులు  సీరియస్‌గా పరిగణించారు. ప్రయివేట్‌ ఆసుపత్రి నిర్వాకం వల్లనే నింద మోయాల్సి వచ్చిందని భావించారు. వెంటనే నగరంలోని ప్రయివేట్‌ ఆసుపత్రులకు ఇకపై రోగులను ఇలా పంపవద్దంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. గత నెల 16వ తేది పేరుతో నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు డయాల్సిస్‌ కోసం నిరుపేద రోగులకు ఎక్కడికో వెళ్లాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
 
 

మరిన్ని వార్తలు