నల్లొండ జిల్లాలో మంత్రి తలసాని పర్యటన

18 May, 2016 07:57 IST|Sakshi

నల్లగొండ: జిల్లాలో పశుసంవర్థక శాఖ పనితీరు మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. పశుసంపదను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాల్సిన ఈ శాఖకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శాఖలో అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కొరత.. నిధులు లేకపోవడం, ఆస్పత్రుల్లో మందులలేమి లాంటి సమస్యలున్నాయి. గత ఏడాది పూర్తిగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గడ్డి అంచనాలను ముందస్తుగా పంపడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు కరువు మండలాలే కాకుండా జిల్లా  వ్యాప్తంగా గడ్డి కొరత వేధిస్తోంది. పశువులు తినేందుకు గడ్డి లేక, మందులు లేక, సిబ్బంది లేక, పర్యవేక్షించాల్సిన అధికారులూ లేక పశుసంవర్థక శాఖ నామమాత్రంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం జిల్లాకు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు జిల్లా కేంద్రంలో పశుసంవర్థక , మత్స్య శాఖల అధికారులతో సమీక్ష కూడా నిర్వహించనున్నారు.
 
 వాస్తవానికి జిల్లాలో పశుసంపద గణనీయంగా ఉంది. తెల్లజాతి పశువులు 5లక్షల వరకు ఉండగా, నల్లజాతి పశువులు 8లక్షల వరకు ఉన్నాయి. గొర్రెలు, మేకలు కలిపి 25లక్షల వరకు ఉంటాయని అంచనా. అదే విధంగా జిల్లాలో 92లక్షల కోళ్లు కూడా ఉన్నాయి. అయితే, జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) కింద జిల్లాలో గొర్రెల యూనిట్లకు గాను రుణం ఇస్తారు. అందులో 60శాతం బ్యాంకులోను కాగా, 20 శాతం సబ్సిడీ, మరో 20 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది.
 
  ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 2250 మంది లబ్ధిదారులను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. వీరికి సబ్సిడీ కింద రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ, 2015-16 సంవత్సరానికి సంబంధించి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే, ఈ నిధులు కేంద్రం ఇవ్వాలంటే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటును చెల్లించాల్సి ఉంటుందని, రాష్ట్రం చెల్లించకపోవడంతోనే కేంద్రం నిధులు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పాటు ప్రణాళిక పథకాల కింద గొర్రెల కొనుగోలుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అమలు చేసే పథకం కూడా ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదు. ఈ పథకం కింద మొత్తం 26.50 లక్షల రూపాయలు అవసరం కాగా, గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు క్వార్టర్లకు సంబంధించి రూ. 12.56 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఆ నిధులతో మొత్తం 179 యూనిట్లకు గాను కేవలం 83 మాత్రమే గ్రౌండింగ్ చేశారని లెక్కలు చెబుతున్నాయి.
 
 పోస్టులు ఖాళీ..
 ఇక,పశుసంవర్థక శాఖలో చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల నుంచి పనిచేయాల్సిన సిబ్బంది వరకు ఖాళీలే కనిపిస్తున్నాయి. ఆ శాఖ లెక్కల ప్రకారమే జిల్లాలో 1 డిప్యూటీ డెరైక్టర్, 9 అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (26), లైవ్‌స్టాక్ ఆఫీసర్ (3), జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ (26), వెటర్నరీ అసిస్టెంట్ (84), అటెండర్లు (71) పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆంధ్రకు వెళ్లిపోయిన అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టులను కూడా ఇంతవరకు భర్తీ చేయలేదని తెలుస్తోంది.
 
 జబ్బు చేస్తే మందుల్లేవు.. తినడానికి గడ్డి లేదు
 ఇక, జిల్లాలో ఉన్న పశుసంపదకు జబ్బు చేస్తే మందులు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో పశువైద్యశాలలున్నాయి. అదే వైద్య శాఖ పరిధిలోని ఆస్పత్రులకు మందుల కోసం రూ.1.50లక్ష వరకు సొంతంగానే ఖర్చు చేసే అవకాశం ఉండడం.. పశువుల ఆస్పత్రులకు మాత్రం మందులు సరఫరా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మందులు కొనుక్కోవాల్సి వస్తోందని పశువుల యజమానులు వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగానే గడ్డి కొరత లేకుండా చూసుకోవాల్సిన అధికారులు అంచనాలను ఆలస్యంగా గ్రహించడంతో దాదాపు లక్ష టన్నుల కొరత ఏర్పడింది. ఒక్క కరువు మండలాల్లోనే 52వేల మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఉందని అంచనా. మిగిలిన మండలాల్లో మరో 30వేలు కలిపి మొత్తం 82వేల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. కరువు మండలాల్లో పశు సంపద కోసం మొత్తం రూ.4కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనాలు పంపినా ఇంతవరకు ఆ నిధులు కూడా రానట్టు తెలుస్తోంది.
 
 మరమ్మతులకూ డబ్బుల్లేవు
 పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పశువులు నీరు తాగేందుకు గాను 1189 నీటితొట్లున్నాయి. మరో 870 తొట్లను మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే, అందుకు గాను నిధులు లేకపోవడంతో వాటికి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి. ఇక, జిల్లాలో కొత్తగా మరో 2,656 తొట్లు నిర్మించాలని కలెక్టర్ నిర్ణయించగా, వీటి నిర్మాణ బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. ఇక, గొర్రెల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు  వాటి బరువును పెంచేందుకు గాను ఏటా మూడుసార్లు నట్టల నివారణ మందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం.  మంత్రి తలసాని చొరవ తీసుకుని అవసరమైన నిధులు మంజూరు చేయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, పశువులకు మందులు సకాలంలో సరఫరా చేయాలనిప్రజలుకోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు