ఖజానా ఖాళీ.. చెల్లింపులకు కటకట

31 Mar, 2017 17:19 IST|Sakshi
ఖజానా ఖాళీ.. చెల్లింపులకు కటకట

► 15 రోజులుగా అన్ని పద్దుల బిల్లుల చెల్లింపునకు లాక్‌
► నేడు ఆర్థికసంవత్సరం ఆఖరి రోజు
► సంక్షేమానికి పడిన బ్రేక్‌ ఫిబ్రవరి జీతాల బిల్లులకు మినహాయింపు


ట్రెజరీ ద్వారా అన్ని రకాల బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్‌ కొనసాగుతోంది. శుక్రవారం ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ బిల్లుల చెల్లింపులపై ప్రతిçష్టంభన కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఇప్పటిదాకా రూ.50 కోట్లపైనే బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, మధ్యాహ్న భోజన పథకం, ఉద్యోగుల టీఏ బిల్లులు, ఎర్న్‌డ్‌ లీవ్‌లు, జీపీఎఫ్, టీఏ, డీఏలు, అరియర్స్‌ క్లెయిమ్స్, విద్యుత్, టెలిఫోన్‌ వంటి కంటెజెన్సీ బిల్లులు, రుణాలు ఆగిపోయిన వాటిలో ఉన్నాయి.

ముద్దనూరు/ కడప సెవెన్‌రోడ్స్‌ : మీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ట్రెజరీకి పంపండి, ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లులు పెండింగ్‌ లేకుండా చూసుకోండి అని ప్రస్తుత టీడీపీ సర్కారు రాకముందు అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందేవి. అయితే గత మూడు సంవత్సరాల నుంచి పద్ధతి మారింది. బిల్లులన్నింటినీ సిద్ధం చేసి ఖజానా కార్యాలయంలో అందించి 15 రోజులు గడుస్తున్నా చెల్లింపుల మాటే ఎత్తడం లేదు. శుక్రవారంతో ఆర్థికసంవత్సరం ముగుస్తున్నా బిల్లుల చెల్లింపునకు అడుగు ముందుకు పడటం లేదు. ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం ట్రెజరీలకు బిల్లుల చెల్లింపులను ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కటకట నెలకొంది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌ చెల్లింపునకు అనుమతులు (బిల్లులకు పాస్‌ఆర్డర్‌) లభించకపోవడంతో అన్నిరకాల చెల్లింపులు ఆగిపోయాయి.

ఉపకార వేతనాలు లేవు: కనీసం విద్యార్థుల ఉపకార వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు రూ.20కోట్ల ఉపకారవేతనాల చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం.  ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్పులకు బడ్జెట్‌ ఉందని, ఇందుకు ఎలాంటి అవరోధాలు కల్పించబోమని ప్రభుత్వం పదేపదే చెబుతుండడం తెలిసిందే. కాగా ప్రస్తుత ఫ్రీజింగ్‌ వల్ల వాటికి బ్రేక్‌ పడడంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఫీజు చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇవి కాక పంచాయతీల జనరల్‌ ఫండ్, కనీసం కర్మకాండలకు చెల్లించే బిల్లులకు సైతం మోక్షం లభించలేదు. ఈనెల 15వ తేదీ తర్వాత ట్రెజరీలకు చేరిన కొందరి జీతాల బిల్లులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

అత్యవసర బిల్లులపైనా బ్యాన్‌: జిల్లాలో 12 ఉపఖజానా, జిల్లా ఖజానా కార్యాలయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన బిల్లులన్నింటినీ చెల్లించాల్సి ఉంది. దీనికి వివిధ రకాల పద్దుల ద్వారా చెల్లింపులు చేపడతారు. అత్యవసరమైన బిల్లులకు క్రమపద్ధతిలో బిల్లుల చెల్లింపునకు అనుమతులు మంజూరవుతాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 15వ తేదీనుంచే బిల్లుల చెల్లింపుపై బ్యాన్‌ వుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికి సుమారు రూ.50 కోట్ల పైచిలుకు బిల్లుల చెల్లింపులకు అనుమతులు లభించక ట్రెజరీల్లోనే ఆగిపోయినట్లు అధికారిక సమాచారం. గత 15రోజులనుంచి బిల్లులు అందకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు.

జీతాల బిల్లులు ఓకే: ఫిబ్రవరికి సంబంధించి ఉద్యోగుల జీతాల బిల్లులకు మాత్రం ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇక సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు బియ్యం, పప్పు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, కాస్మోటిక్స్‌ తదితర వాటికి ఇచ్చే డైట్‌ చార్జీలు సైతం నిలిపివేశారు. జిల్లాలో మధ్యాహ్నం భోజన పథకాన్ని నిర్వహిస్తున్న ఏజెన్సీలకు ఆరు నెలలుగా జీతాలు, అలాగే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో తెలియకపోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

నేటి అర్ధరాత్రి వరకు పనిచేస్తాం: బిల్లుల చెల్లింపునకు అనుమతులు నిలిచిపోయిన మాట వాస్తవమే. శుక్రవారం ఆర్థిక సంవత్సరం చివరి రోజు. అనుమతి వచ్చిన బిల్లుల చెల్లింపునకు శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేయాలని ఆదేశాలున్నాయి. ---సత్యవతి, డీడీ జిల్లా ట్రెజరీస్‌

మరిన్ని వార్తలు