రైతు సంక్షేమం గాలికే!

31 Jul, 2016 23:07 IST|Sakshi
రైతు సంక్షేమం గాలికే!
మచిలీపట్నం:
జిల్లా వ్యవసాయశాఖలో మల్టీపర్పస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎంపీఈవో,) పోస్టుల భర్తీ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పోస్టులను భర్తీ చేయకుండా జాప్యం జరుగుతోంది. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారుల స్థానంలో ఎంపీఈవోల నియామకాన్ని ప్రభుత్వం 2015లో చేపట్టింది. కృష్ణాజిల్లాకు 346 ఎంపీఈవో పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2015లోనే ఈ పోస్టుల నియామకం జరిగింది. కాంట్రాక్టు పద్దతిపై పనిచేసే ఎంపీఈవోలకు నెలకు రూ. 8వేలు వేతనంగా ప్రకటించటంతో ఉద్యోగాలు పొందిన కొందరు ఈ వేతనాలు చాలవంటూ మానేశారు. ప్రస్తుతం జిల్లాలో 43 ఎంపీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చర్‌ బీఎస్సీ, డిప్లమో ఇన్‌ పాలిటెక్నిక్‌ (అగ్రికల్చర్‌) పట్టభద్రులు వీటికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎంపీఈవోలకు నెలకు రూ. 8వేలు వేతనంగా ఇవ్వగా ప్రస్తుతం దీనిని రూ. 12వేలకు పెంచారు. దీంతో ఈ పోస్టులకు డిమాండ్‌ ఏర్పడింది. 
ఇక్కడ పెండింగే 
ఖాళీగా ఉన్న 43 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో నియామకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మన జిల్లాలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. గతంలో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులు ఇవ్వకుండా, కొత్త నియామకాలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  గ్రామాల్లో రైతులు అవలంభించాల్సిన యాజమాన్య పద్ధతులు, పొలంబడి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టం అంచనా,  ప్రభుత్వం ద్వారా రైతులకు ఒనగూరే ప్రయోజనాలను వివరించటం, తదితర విధులు ఎంపీఈవోలవే. 
కలెక్టర్‌కు నివేదిక పంపాం 
జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీఈవో పోస్టుల భర్తీపై ’సాక్షి‘  వ్యవసాయాధికారులను సంప్రదించగా, çకలెక్టర్‌కు నివేదిక పంపామని చెబుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలు ఇస్తే గతంలో ఒకటి, రెండు విడతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వటం జరుగుతుదని చెబుతున్నారు. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు అధిక మంది ఉండటంతో నోటిఫికేషన్‌ జారీ చేయలేదని చెబుతున్నారు. 
 
మరిన్ని వార్తలు