ధర దగే?

11 Sep, 2016 21:14 IST|Sakshi
గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో మక్కలు
  • పనిచేయని కొనుగోలు కేంద్రాలు
  • నామ్‌కే వాస్తేగా ప్రభుత్వ రంగ సంస్థలు
  • ‘ఈ-నామ్‌’పై బోలెడు సందేహాలు
  • వారంలో మార్కెట్లకు రానున్న ఉత్పత్తులు
  • ఆందోళనలో అన్నదాతలు
  • గజ్వేల్‌: ఈసారి కూడా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవహారంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. సివిల్‌సప్లయ్‌, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంతో సమస్య తీవ్రమైంది. అంతేకాకుండా సీసీఐ కూడా నామమాత్రంగా పనిచేస్తుండటంతో పత్తి రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

    దళారులను నమ్ముతూ.. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్‌’ అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. సర్కారే కొనుగోలు బాధ్యతలు చేపట్టాలని రైతులు భావిస్తున్నారు.

    మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్‌.. వడ్లు కొనుగోలు చేసే సివిల్‌సప్లయ్‌(పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ), ఆముదాలు, పొద్దుతిరుగుడు తదితర నూనె ఉత్పత్తులు కొనుగోలు చేసే అయిల్‌ఫెడ్‌ సంస్థలు జిల్లాలో తమ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి.

    మరోపక్క పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కూడా నామమాత్రంగా కేంద్రాలను నడుపుతోంది. అంతేకాకుండా కొనుగోళ్లను పూర్తిగా సహకార సంఘాలు, ఇతర సంస్థలకు వదిలేస్తూ ప్రభుత్వరంగ సంస్థలు పర్యవేక్షణకే పరిమితమైంది. దీంతో మరో వారంలో మార్కెట్‌ పంటలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్‌’(ఈ-నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) విధానంతో మంచి ఫలితాలుంటాయని సర్కార్‌ వాదిస్తున్నా.. ప్రభుత్వ సంస్థలే నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు భావిస్తున్నారు.

    1.22 లక్షల హెక్టార్లలో పంటలు
    జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.22 లక్షల హెక్టార్లకుపైగా మొక్కజొన్న.. 84,175 హెక్టార్లలో పత్తి.. 34,272 హెక్టార్లకుపైగా వరి.. 40,593 హెక్టార్లలో కంది.. 29,396 హెక్టార్లలో సోయాబీన్‌.. 27,351 హెక్టార్లలో పెసర్లు సాగులోకి వచ్చాయి. మొక్కజొన్న ఉత్పత్తులు మరో వారంలో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌ రెండో వారం నుంచి ధాన్యం, పత్తి ఉత్పత్తులు సైతం అందుబాటులోకి రానున్నాయి.

    ఆదుకోని మార్క్‌ఫెడ్‌
    జిల్లాలో విస్త్రతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాల్సిన మార్క్‌ఫెడ్‌.. ఆ బాధ్యతలను మరచిపోయింది. ఐకేపీ సంఘాలకే కొనుగోలు బాధ్యతలను అప్పగించి కేవలం పర్యవేక్షణకు పరిమితమైంది. మూడేళ్ల క్రితం గజ్వేల్‌లో మక్కల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అక్రమాలు చోటుచేసుకున్న వ్యవహారంలో ముగ్గురు సిబ్బంది సస్పెండ్‌ అయ్యారు.

    నాలుగేళ్ల క్రితం వరకు వరి ఉత్పత్తులకు సంబంధించి గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది కొనుగోలు కేంద్రాలను కొనసాగించింది. ప్రస్తుతం అవి కూడా మూతపడ్డాయి.

    కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 50 వరకు కేంద్రాలను ఏర్పాటు చేసి.. కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమైంది.

    ప్రతికూల ఫలితాలు
    గతంలో సివిల్‌ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేది కాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. అక్రమాల దృష్ట్యా గత ఏడాది నుంచి ఐకేపీ కేంద్రాలను సైతం కుదించారు.

    ప్రత్యేకించి సహకార సంఘాలు కొనుగోళ్ల రంగంలోకి రావడం ఇది మూడో ఏడాదే. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5 శాతం కమీషన్‌ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలకు మార్కెటింగ్‌ అధికారులు యార్డులున్న చోట కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తుండగా.. మిగిలినచోట్ల సంస్థలే కొనుగోలు బాధ్యతలు చూసుకోవాలి.

    ఇలాంటి పరిస్థితిల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతోంది. ఇదిలా ఉండగా పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదు. సీజన్‌లో ఈ కేంద్రాలను నిరంతరంగా కొనసాగించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి.. నష్టపోతున్నారు.

    ‘ఈ-నామ్‌’ సరే... ప్రభుత్వ రంగ సంస్థల మాటేమిటి?
    కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్‌’ మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌లలోనే కాకుండా దేశంలో మొదటి విడతలో ఉన్న 200 మార్కెట్‌లలో ఎక్కడైనా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు.

    అంతేకాకుండా ఉత్పత్తులు ఎక్కువగా వచ్చినప్పుడు ధర తక్కువగా ఉండి నష్టపోకుండా సరుకుకు డిమాండ్‌ ఉన్న రాష్ట్రంలో ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముకోవచ్చు. రైతులు ఎప్పటికప్పుడు ‘ఈ-నామ్‌’ ద్వారా దేశ మార్కెట్‌లలోని ధరలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా మరెన్నో లాభాలు ఈ విధానంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44 మార్కెట్‌ యార్డుల్లో ‘ఈ-నామ్‌’ అమల్లోకి రాగా.. జిల్లాలోని గజ్వేల్, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్, సిద్దిపేట మార్కెట్‌లలో ఈ-నామ్‌ అమల్లోకి వచ్చింది. ఈ విధానం బాగానే ఉన్నా... కొనుగోళ్ల రంగంలోకి తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే తప్ప రైతుల ఇబ్బందులు తీరే అవకాశం లేదు.

మరిన్ని వార్తలు