ఆరేళ్లుగా అదే వేతనం

18 Aug, 2016 23:13 IST|Sakshi
 • మినీ గురుకులాల్లో సీఆర్టీలకు పెరగని జీతం
 • ఇబ్బందుల్లో ఒప్పంద ఉపాధ్యాయులు 
 • బేల : జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుతున్న మినీ గురుకులం బాలికల ప్రాథమిక పాఠశాలల సీఆర్టీల వేతనాలు పెరగడం లేదు. ఆరేళ్లుగా వారు చాలీచాలని వేతనంతో పనిచేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మిగతా విద్యాసంస్థల్లో పెంచినట్లు తమ వేతనాలూ డిమాండ్‌ చేస్తున్నారు.
  జిల్లాలోని బేల మండలం సదల్‌పూర్‌ గ్రామం, నార్నూర్‌ మండలం లోకారి, నేరడిగొండ మండలం గుప్తాల, మామడ మండల కేంద్రంలో ఒక్కోటి చొప్పున 2000 సంవత్సరంలో మినీ గురుకులం బాలికల ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో విద్యాబోధన కోసం ఐదుగురు సీఆర్టీలు, ఒక సీఈటీ, ఒక ఏఎన్‌ఎంను నియమించారు. సీఆర్టీకి ప్రతీ నెల రూ.4వేలు, అకౌటెంట్‌కు రూ.3,500 వేతనం ఉంది. ఇవి కూడా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని కస్తూర్బాగాంధీ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు రూ.15000 వరకు, వీవీలకు 8వేల వరకు వేతనాలు పెరిగాయి. కానీ మినీ గురుకులాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం ఆరేళ్లుగా నిరాశే మిగిలింది. ప్రభుత్వం తమ వేతనాలు పెంచాలని సీఆర్టీలు కోరుతున్నారు. 
  చాలీచాలని వేతనం
   ఈ గురుకులం ప్రారంభం నుంచి పనిచేస్తున్న. ఇప్పుడు ప్రతీ నెల వేతనం రూ.4వేలు ఉంది. ఈ వేతనం రెండు, మూడు నెలలకోసారి వస్తుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు.
  – రేవతి, సీఆర్టీ, మినీ గురుకులం సదల్‌పూర్‌ (బేల) 
  వేతనాలు పెంచాలి
  అన్ని ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో సీఆర్టీలకు వేతనాలు పెంచారు. కానీ మినీ గురుకులంలో పనిచేస్తున్న మాకు ఇప్పటి వరకూ వేతనాలు పెంచలేదు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించాలి.
  – కవిత, సీఆర్టీ, మినీ గురుకులం లోకారి (నార్నూర్‌) 
   
                     
మరిన్ని వార్తలు