శ్రీమఠంపై అజమాయిషీ లేదు

24 Jan, 2017 21:37 IST|Sakshi
శ్రీమఠంపై అజమాయిషీ లేదు
 -దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వెల్లడి
- రాఘవేం‍ద్ర స్వామి దర్శనానంతరం మఠం పీఠాధిపతితో  ఏకాంత భేటీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంపై దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదని మంత్రి మాణిక్యాల రావు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ సోమువీర్రాజుతో కలిసి శ్రీమఠం రాఘవేంద్ర స్వామి దర్శనానికి  ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.   రాష్ట్రవ్యాప్తంగా పేద భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కార్యక్రమం చేపట్టామన్నారు.   టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త నిధులతో రాష్ట్రంలో కొత్తగా 500 దేవాలయాలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.   విశాఖపట్నంలో యోగా యూనివర్సిటీ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశామన్నారు. అంతకుముందు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన, హారతులు పట్టి రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి జ్ఞాపిక, శేషవస్త్రం, ఫలపూల మంత్రాక్షితలతో వారిని ఆశీర్వదించారు. 
 
పీఠాధిపతితో మంత్రి ఏకాంత భేటీ
 రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో ఏకాంతంగా భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటు స్వామిజీ ప్రత్యేక గదిలో మంతనాలు సాగించారు.  ఆ సమయంలో శ్రీమఠం ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మంత్రి గత  పర్యటన వచ్చి వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలో శ్రీమఠానికి కొన్ని జీవోలు, వెసులబాటులు కల్పించారు. ఉద్యోగ భద్రతకు ఉరిగా జీవో 35 ప్రకటించారు. అయితే, ఉద్యోగుల ఆందోళన దృష్ట్యా  సదరు జీవోను సుప్తచేతనావస్థలో ఉంచిన విషయం విదితమే. అయితే,  ప్రస్తుత భేటీ రీత్యా శ్రీమఠానికి ఎలాంటి జీవోలు వస్తాయోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. 
 
స్థలభావం సమస్య తీర్చండి : వై.బాలనాగిరెడ్డి
నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడా ప్రభుత్వ భూములు లేవని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రం చుట్టు శ్రీమఠం భూములు మాత్రమే ఉన్నాయన్నారు.  ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు,  పేదలకు గ​ృహనిర్మాణానికి స్థలం కరువైందన్నారు. మండల కేంద్రం అభివృద్ధి నిమిత్తం శ్రీమఠం భూముల విషయంలో ఆలోచించాలన్నారు. అందుకు మంత్రి సమాధాన మిస్తూ శ్రీమఠంతో చర్చిస్తామన్నారు. అవసరమైతే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి అవసరాలు తీర్చేందుకు యత్నిస్తామన్నారు. పర్యటనలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నీలకంఠప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీఎస్‌ నాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రాజారెడ్డి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు