పిలుపు... తలుపు తట్టలేదేంటబ్బా

21 Oct, 2015 10:17 IST|Sakshi
పిలుపు... తలుపు తట్టలేదేంటబ్బా

గుంటూరు : రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూములిచ్చిన 23 వేల మంది రైతులను శంకుస్థాపనకు ఆహ్వానించి పెద్దపీట వేసి గౌరవిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి గ్రామంలో రైతుల ఇళ్లుకు వెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు యజమాని, యజమానురాలికి పంచె, ధోవతి, చీర ఇచ్చి బొట్టుపెట్టి ఆహ్వానం పలకాలని నిర్ణయించింది. దీని కోసం కొందరు మహిళలను ఎంపిక చేసింది.

శనివారం సాయంత్రం తొలిసారి నేలపాడు నుంచి అట్టహాసంగా చీర, పంచె, ధోవతితోపాటు స్వీట్ బాక్స్ ఇచ్చి పంపిణీ ప్రారంభించింది. ఈ హడావుడి కేవలం నేలపాడు, తుళ్ళూరు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది.  అనంతరం చీర, పంచె మాత్రమే పంపిణీ చేస్తోంది. అదీ పూర్తి నాసిరకం వస్త్రాలు కావడంతో రాజధాని ప్రాంతంలోని అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల రైతులు తిరస్కరించారు.

అందని ఆహ్వానం
అధిక సంఖ్యలో రైతులకు ఇప్పటి వరకు ఆహ్వానాలు అందకపోవటంతో సందిగ్ధంలో ఉన్నారు. భూములిచ్చిన రైతుల వివరాలు కొన్ని కంప్యూటర్లో పొందుపరచలేదని అధికారులు చెబుతున్నారు. వీరికి ఆహ్వానాలు అందలేదు, శంకుస్థాపనకు గడువు ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ సమయంలో 29 గ్రామాలకు చెందిన 23 వేల మంది రైతులకు ఆహ్వానాలు చేరుతాయో ? లేదోనని అర్థంగాని పరిస్థితి నెలకొంది.

పొరుగు ప్రాంతాల్లో రైతుల పరిస్థితేంటి ?
ఇక్కడి పొలాలుండి హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాలతోపాటు మరి కొందరు విదేశాల్లో నివాసముంటున్నవారిలో అనేక మంది రైతులున్నారు. వీరు రాజధానికి భూములిచ్చారు. ఈ రైతులకు ఇప్పటి వరకు ఆహ్వానాలు అందలేదు. ఇంక శంకుస్థాపనకు ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. వీరికి ఆహ్వానాలు ఎలా పంపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

స్పీడు పోస్టులో ఆహ్వానాలు పంపడం కష్టతరమే
పొరుగు ప్రాంతాల్లో నివాసముంటున్న రైతులకు స్పీడు పోస్టులో ఆహ్వానాలు, వస్త్రాలు పంపేందుకు ప్రభుత్వం వారం క్రితం సంబంధిత అధికారులతో చర్చించింది. ఇప్పటి వరకు స్పీడు పోస్టులో కూడా పంపలేదు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ సీలింగ్ రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆహ్వానంతోపాటు స్వీట్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం అందరికీ పంపిణీ చేయలేదు. శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా రాజధాని రైతులనూ ఆహ్వానించకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

>
మరిన్ని వార్తలు