కోరం లేకపాయె.. సభ ఆలస్యమాయె..

25 Jul, 2016 00:36 IST|Sakshi
పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు
  • జడ్పీ సర్వసభ్య సమావేశం తీరు
  • రాజయ్య మినహా ఎమ్మెల్యేలు గైర్హాజరు
  • ముఖమైనా చూపని మంత్రి, ఎంపీలు
  • సమస్యలపై వాడీవేడిగానే చర్చ
  • విద్యా, వైద్యం, సాగుపై సభ్యుల ప్రశ్నలు
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: ‘పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైంది. పది రోజుల్లో యూనిట్‌ టెస్ట్‌ పరీక్షలు రానున్నాయి..పుస్తకాలు లేవు..యూనిఫాం రాలేదు.. విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేరు... అన్ని మండలాల్లో హెచ్‌ఎంలే ఇన్‌చార్జి ఎంఈఓలుగా ఉన్నారు. పాఠశాలలపై పర్యవేక్షణ లేదు. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ సాగుతోంది.. గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు ..అత్యవసరానికి అంబులెన్స్‌లు, మందులు లేవు. వ్యవసాయానికి రుణాలు లేక రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.. రుణమాఫీ నిధుల కోసం ఎదురు చూస్తుంటే బ్యాంక్‌లు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. పోడు చేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలి..’ అని సభ్యులు డిమాండ్‌ చేశారు. చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశం ఆదివారం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సరిపడా సభ్యులు లేక 10.50 గంటలకు ప్రారంభమైంది. 
    సమావేశం ఇలా..
    సమావేశ వేదిక పైకి 10.40 గంటలకు చైర్‌పర్సన్, జేసీ, సీఈఓ వచ్చారు. అప్పటికి కోరం 19 మందికిగాను 16 మంది మాత్రమే ఉన్నారు. 10.50 గంటలకు కోరం పూర్తవడంతో సమావేశాన్ని చైర్‌పర్సన్‌ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు అనేక అంశాలను ప్రస్తావించారు.
     
    ఎవరు ఏమన్నారంటే...
    ∙జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా, సమాంతరంగా తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఏజెన్సీలో వ్యాధులు ప్రబలుతున్నాయి. మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యావ్యవస్థ మెరుగుపడాలి. పాఠశాలలకు కాంపౌండ్‌ వాల్స్, మరుగుదొడ్లు నిర్మించాలి. 
    ∙భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య: 2005కు ముందు పోడు చేసుకుంటున్న వారిపై అటవీశాఖ దాడులను ఆపాలని ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో అందరం ముక్త కంఠంతో కోరాం. ఫలితం లేదు. దాడులు కొనసాగుతున్నాయి. ఈ రాతి హింస ఆపాలి. దీనిపై తీర్మానం చేయాలి.
    ∙కోఆప్షన్‌ సభ్యుడు జియావుద్దిన్‌: పాఠశాలలకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు. యూనిఫాం రాలేదు. ఎంఈఓలు, ఉపాధ్యాయులు లేరు. చదువులు ఎలా సాగుతాయి? చెరువుమాధారంలో 600 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్న విషయమై మంత్రి ఆదేశించేంత వరకు విజిలెన్స్‌ అధికారులు కదల్లేదు. జిల్లాలో పాలన ఇలా ఉంది.
    ∙బయ్యారం జడ్పీటీసీ సభ్యుడు ఐలయ్య: టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటను అటవీ అధికారులు తొలగించారు.  20, 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములలో దాడులు చేయడం తగదు.
    ∙బోనకల్లు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ: 41 మండలాలకుగాను నలుగురు ఎంఈఓలే ఉన్నారు. ఇక చదువులు ఎలా సాగుతాయి?
    ∙గుండాల జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి: ఆశ్రమ పాఠశాలలకు ఉపాధ్యాయులు 11 గంటలకు వస్తున్నారు. తనిఖీ చేయాలని పీఓను కోరినా పట్టించుకోవడం లేదు. అటవీరామవరంలో ఒక టీచర్‌కు బదులు మరొకరు వస్తున్నారు. ఎంఈఓకు చెప్పినా స్పందన లేదు.
    ∙కొత్తగూడెం జెడ్పీటీసీ సభ్యురాలు పరంజ్యోతి: సీతారాంపురం గ్రామంలో స్కూల్‌ అదనపు గదులు నిర్మాణం పూర్తికాకుండానే నిధులు డ్రా చేశారు. దీనిపై విచారణ జరిపించాలి. (విచారణ జరిపిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ దివ్య చెప్పారు).
    ∙గుండాల ఎంపీపీ: పీహెచ్‌సీలలో డాక్టర్లు లేరు. దోమతెరలు ఇవ్వలేదు. ఫాగింగ్‌ చేయలేదు. మండలాల్లో కూడా నిధుల్లేవు.
    ∙వాజేడు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు: మా ప్రాంతంలోని రెండు పీహెచ్‌సీలలో అంబులెన్స్‌లు లేవు. వాజేడులో డాక్టర్‌ సరిగ్గా పనిచేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
    ∙చర్ల జెడ్పీటీసీ సభ్యురాలు హరిత: అంబులెన్స్‌ లేదు. హాస్పిటల్‌ భవనం శిథిలావస్థలో ఉంది.
మరిన్ని వార్తలు