అప్పు పుట్టదే?

30 Jun, 2016 08:33 IST|Sakshi
అప్పు పుట్టదే?

సమయం మీరినా అందని రుణాలు
బ్యాంకుల చుట్టూ తిరిగినా నిష్ర్పయోజనం విధిలేక ప్రైవేట్ అప్పులు
అందని కరువు సాయం ఇబ్బందుల్లో రైతులు
నేడు కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం

సాక్షి, సంగారెడ్డి: ఇప్పుడిప్పుడే వర్షాలు జోరందుకోవడంతో రైతులు ఖరీఫ్ సాగుపై దృష్టిసారించారు. అయితే చేతిలో పైకం లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడోవిడత రుణమాఫీ డబ్బులు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు ఇవ్వడం లేదు. పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులు, పంట నష్ట పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు మంజూరు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం  కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్ల సమావేశం (డీసీసీ) జరగనుంది.

ఈ సమావేశంలో ఖరీఫ్ రుణాల మంజూరు, రుణమాఫీ, పంటనష్ట పరిహారం చెల్లింపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకర్ల మీటింగ్‌తోనైనా ఖరీఫ్ రుణ మంజూరులో వేగం పెరిగితే బాగుంటుందన్న భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రూ.1,770 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెల్సిందే. బ్యాంకుల వారీగా ఖరీఫ్ రుణ లక్ష్యాలను నిర్దేశించినా మంజూరృులో మాత్రం నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత రెండేళ్లుగా కరువు బారిన పడిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో రుణం కోసం బ్యాంకర్లు వైపు చూస్తున్నారు. సాగుకు అవసరమైన మేర పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయకపోవటంతో విత్తనాలు విత్తుకునే సమయం దాటిపోతుందనే భయంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని సాగు పనులు మొదలు పెడుతున్నారు. ఇకనైనా బ్యాంకర్లు రుణాల మంజూరును వేగవంతం చేస్తే  మేలు జరుగుతుందని రైతు నాయకులు చెబుతున్నారు.

 రుణమాఫీ కోసం ఎదురుచూపులు..
మూడో విడత రుణమాఫీ డబ్బులు ఇంకా రైతులు ఖాతాలో జమకాలేదు. దీంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారు. 2014-15లో 3,96,191 మంది రైతుల ఖాతాల్లో రూ.483 కోట్లు రుణమాఫీ డబ్బులను జమచేయటం జరిగింది. అలాగే రెండవ విడతగా 2015-16 సంవత్సరానికి మరో రూ.483 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులను రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. కాగా మూడవ విడత రుణమాఫీ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమచేయలేదు. మూడో విడత రుణమాఫీ డబ్బులు సైతం రెండు విడతల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మూడో విడత రుణమాఫీకి సంబంధించి మొదటివిడతగా రూ.240 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి తమకు సమాచారం లేదని బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

 అందని కరువు సాయం
ఏడాదిగా రైతులు పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరువు కారణంగా ఆరుతడిపంటలతోపాటు బోరుబావులు కింద సాగు చేసిన పంటలు సైతం నష్టపోయాయి. గత ఏడాది ఖరీఫ్‌లో 33శాతానికిపైగా  2.72 లక్షల హెక్టార్లలో రూ.197.97 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పంటనష్టం దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అధికారులు జిల్లాలోని 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులకు రూ.197.97 కోట్ల  పరిహారం చెల్లించాలని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేశారు. కేంద్ర కరువు సహాయక బృందం అధికారులు కరువు సాయంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. దీంతో పరిహారం త్వరగానే అందుతుందని రైతులు భావించారు. అయినా ఇంత వరకు కరువు సాయం రైతులకు అందలేదు.

మరిన్ని వార్తలు