‘గ్రేటర్‌’లో ఉన్నా రూరల్‌ జిల్లాలోనే గీసుకొండ!

6 Oct, 2016 00:44 IST|Sakshi
‘గ్రేటర్‌’లో ఉన్నా రూరల్‌ జిల్లాలోనే గీసుకొండ!
మూడు డివిజన్లు, 17 పంచాయతీలూ రూరల్‌ జిల్లాలోకి..
అభ్యంతరం చెబుతున్న స్థానికులు 
 
గీసుకొండ : కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్‌ రూరల్‌ జిల్లాలోకి గీసుకొండ మండలం రాబోతోంది. ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో ఉండగా.. ఈ ప్రాంతం నగరాన్ని ఆనుకుని ఉండి, కొంత మేర గ్రేటర్‌ వరంగల్‌లో భాగమైనా జిల్లాల పునర్విభజనలో భాగంగా మొత్తం మండలాన్ని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో చేర్చనున్నారు.
 
ఈమేరకు కలెక్టర్‌ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పొందుపరినట్లు తెలుస్తోంది. గతంలో 25 గ్రామపంచాయతీలతో గీసుకొండ మండలం ఉండగా.. ఎనిమిది గ్రామపంచాయతీలను గ్రేటర్‌ వరంగల్‌ 2013 ఆగస్టు 1న  విలీనం చేశారు. దీంతో మండలంలోని   రెడ్డిపాలెం, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కీర్తీనగర్‌,  ధర్మారం, జాన్‌పాక, గరీబ్‌నగర్‌, స్తంభంపెల్లి, వసంతాపూర్‌, దూపకుంట ప్రాంతాలు నగరంలోకి చేరగా వీటిని 2, 3, 4వ డివిజన్లుగా ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు మండలానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో నగరంలో విలీనమైన ప్రాంతం వరంగల్‌ జిల్లాలో, మిగతాది రూరల్‌ జిల్లాలో కొనసాగుతుందని అంతా భావించారు. కానీ మండలం మొత్తం వరంగల్‌ రూరల్‌ జిల్లా కిందికి వెళ్లనున్నట్లు ప్రతిపాదనల్లో పొందుపర్చడంతో స్థానిక ప్రజలు,  ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలోనే మండలాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కాగా, సంగెం మండలం నుంచి గ్రేటర్‌ వరంగల్‌లో విలీనమైన బొల్లికుంట, గాడెపల్లి గ్రామాలు ప్రస్తుతం 4వ డివిజన్‌లో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలతో పాటు సంగెం మండలం మొత్తం కూడా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోకి వెళ్లనుంది.
మరిన్ని వార్తలు