గంటల తరబడి నిరీక్షణ

14 Dec, 2016 02:50 IST|Sakshi

∙జోగిపేటలో తెరుచుకోని ఏటీఎంలు
∙బ్యాంకుల్లో భారీ క్యూలైన్లు
∙ఆంధ్రాబ్యాంకు గేటుకు తాళం
∙విత్‌డ్రా ఓచర్‌లను పంపిణీ చేసిన కానిస్టేబుల్‌

జోగిపేట : మూడు రోజులు పాటు బ్యాంకులన్నీ మూసి ఉండటంతో  ఖాతాదారులు, ప్రజలు ఒక్కసారిగా బ్యాంకుల వద్ద ఎగబడ్డారు. ఉదయం బ్యాంకు తెరుచుకోక ముందే 9 గంటల వరకు క్యూలో నిలబడ్డారు. ఎస్‌బీహెచ్,  ఆంధ్రాబ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారంతా మెయిన్‌ రోడ్డు వరకు క్యూలో నిలబడ్డారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆంధ్రాబ్యాంకులోకి ఒకేసారి ప్రజలు రావడంతో పోలీసులు అదుపు చేశారు. గేట్‌కు తాళం వేశారు. 10 మంది చొప్పున లోపలికి వదిలారు. కొందరు నగదును తమ ఖాతాల్లో వేసుకున్నారు. మరికొందరు డబ్బు డ్రా చేసుకున్నారు. కొందరు రద్దయిన నోట్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. వృద్ధులు, బాలికలు ఇబ్బందులు పడుతూ డబ్బు డ్రా చేసుకుంటున్నారు. మంజూరైన రుణాన్ని ఒకేసారి ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాకపోవడంతో సెల్ప్‌హెల్ప్‌ గ్రూపుల మహిళలూ అవస్థలు పడ్డారు. ఎస్‌బీహెచ్‌ వద్దకు ఒకేసారి ప్రజలు రావడంతో మేనేజర్‌ మారుతికుమారే స్వయంగా వారిని అదుపు చేయాల్సి వచ్చింది. అందరికీ డబ్బులు ఇస్తామని, సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బ్యాంకులు తెరచి ఉంటాయని అన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు క్యూలో చాలా సేపు నిలబడాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఆసరా పథకం పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన మహిళలు కిందే కూర్చున్నారు.

రూ.ఆరు వేలు మాత్రమే..
మూడు రోజుల వరకు ఎస్‌బీహెచ్‌లో రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ చేశారు. మంగళవారం మాత్రం ఒక్కరికి రూ.6 వేలు మాత్రమే చెల్లించబడునని పోస్టర్లను అతికించారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. సగం రోజు సెలవుపెట్టి వచ్చినా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రూ.10 వేలు చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగదు అందుబాటులో లేకపోవడంతోనే రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నట్లు మేనేజర్‌ మారుతికుమార్‌ నచ్చజెప్పారు. అత్యవసరమైన వారికి డబ్బులను సమకూర్చేందుకు మేనేజర్‌ సహకరిస్తున్నట్లు సమాచారం. ఎస్‌బీఐలో చాలా రోజులుగా రూ.2,500, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు చెల్లిస్తున్నారు. మూడు రోజుల తర్వాత నగదు జోగిపేటకు  వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పెద్దనోట్లు రద్దయిన తర్వాత పోలీసు శాఖ కీలకంగా వ్యవహరిస్తోందనే చెప్పొచ్చు. వందల సంఖ్యలో ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు చేరుకొని గొడవ చేస్తేంటే పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. గత నెల రోజులుగా జోగిపేట పోలీసులు చేస్తున్న కృషిని బ్యాంకుల మేనేజర్లు అభినందిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు వద్ద రద్దీ ఎక్కువ కావడంతో బ్యాంకు మెయిన్‌ గేట్‌ను మూసేసి కొందరినే పంపిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన పని పోలీసులే చేస్తున్నారు. డబ్బు డ్రా చేసుకునేందుకు అవసరమైన ఓచర్లను కానిస్టేబుల్‌లే క్యూలో నిలబడ్డ వారికి ముందుగానే పంపిణీ చేస్తున్నారు. వారు తమకు ఎంత అవసరం ఉందో రాసిపెట్టుకుంటే తొందరగా పని పూర్తయ్యేందుకు వీలుంటుందని సహకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు