బిల్లు చెల్లిస్తే ఒట్టు!

12 Sep, 2016 23:47 IST|Sakshi
చెల్లింపులు లేక వెలవెలబోయిన చెల్లింపులు ఖాతాల కార్యాలయం
జిల్లాలో రూ.77.84కోట్లు నీరు–చెట్టు బిల్లుల పెండింగ్‌
ఇప్పటివరకు చేసినవి రూ.11.5కోట్లే
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు
గతేడాది పరిస్థితి పునరావతం
వచ్చే ఏడాది పనులపై ప్రభావం
 
 
ఈ ఏడాది నీరు చెట్టు పథకంలో మంజూరైన ఫొటోలు: 2713
మంజూరైన నిధులు: రూ.184.75కోట్లు
చేపట్టిన పనులు: 1649
చేపట్టిన పనుల విలువ: రూ. 89.34కోట్లు
చేసిన బిల్లులు: రూ.11.5కోట్లు
 
విజయనగరం గంటస్తంభం: నీరు చెట్టు పనులు అక్రమాలకు ఆనవాళ్లు... అంతా కనికట్టు అన్నది ఎంత సత్యమో... దాని ఫలితాలు అంతేనన్నది కూడా అంతే నిజం. ఈ పనుల ద్వారా పెరిగిన భూగర్భ జలాలు... తీరిన నీటికొరత... ఇలా అన్నీ తమ గొప్పతనమేనని చెప్పుకుంటున్న పాలకపక్ష నేతలు... ఆసలు ఎన్ని పనులు చేపట్టారు... ఎన్ని పూర్తి చేశారు... అందులో ఎన్నింటికి బిల్లులు చెల్లించారు... అన్నది పరిశీలిస్తే ప్రచారానికి వాస్తవ పరిస్థితికి తేడా స్పష్టమవుతుంది. ఇక్కడ అక్రమాలు... అవినీతి పనులు నాణానికి ఒక పార్శ్వమైతే... బిల్లులు చెల్లించక నిర్వాహకులు పడుతున్న అవస్థలు మరో కోణం. నీరు చెట్టు పథకం కింద నీటిపారుదలశాఖ కొన్ని పనులు చేపట్టింది. ఇందులో కొన్ని నామినేషన్‌ పద్ధతిపైనా... మరికొన్ని పనులు టెండర్ల విధానంలోనూ చేపట్టారు. అయితే వివిధ కారణాల రీత్యా ఈ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. చాలావరకు పనులు అసలు ప్రారంభమే కాలేదు. కాగా... చేసిన పనులకు ప్రభుత్వం ఇప్పటివరకూ బిల్లులు చేయకపోవడం విశేషం. వాస్తవానికి రూ.89.34కోట్ల విలువైన పనులు చేపట్టగా... ఇప్పటివరకు చెల్లించింది రూ.11.5కోట్లే. పెండింగ్‌లో ఉన్న రూ.77.84కోట్లలో రూ.39కోట్లు విలువల చెల్లింపులు ఖాతాల కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి.
విడుదల కాని నిధులు
వీటికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంవల్లే బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయని... జూలై నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదిలా ఉండగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. బిల్లులకోసం ఇరిగేషన్, చెల్లింపులు ఖాతాల కార్యాలయాలకు వచ్చి ఆరా తీసి వెళ్లిపోతున్నారు. పనులు చేపట్టిన తమ్ముళ్లు సైతం తమ సర్కారు తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో నీరు–చెట్టు పనులంటేనే భయపడుతున్నారు. ఇంకా ప్రారంభం కాని పనులు ఇక మొదలుపెట్టేందుకే వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా 1069 పనులు అసలు నిలిచిపోయే అవకాశం ఉంది. 
 
బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి– నాగేశ్వరరావు, జిల్లా పేఅండ్‌అకౌంట్సు అధికారి, విజయనగరం
ఇరిగేషన్‌ అధికారుల నుంచి వచ్చిన నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌ ఉన్న విషయం నిజమే. మా దగ్గర ఉన్నవి సుమారు రూ.39కోట్ల బిల్లులు. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయాల్సి ఉంది. విడుదలైన వెంటనే బిల్లులు చెల్లిస్తాం. 
 
 
మరిన్ని వార్తలు