ప్లేగ్రౌండ్స్‌ కరువు

21 Aug, 2016 19:51 IST|Sakshi
పేటలో కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు(ఫైల్‌)
 • పేటలోని పాఠశాలలకు మైదానాలు కరువు
 • దూరమవుతున్న వ్యాయామ విద్య
 • మౌలిక వసుతులు లేక విద్యార్థుల అవస్థలు
 • పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధిలో కెజివిబి, మోడల్‌స్కూల్‌లతో కలిపి 7 ఉన్నత పాఠశాలలు ఉన్నప్పటికి క్రీడామైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామవిద్యకు దూరమవుతున్నారు.

  ప్రభుత్వం పాఠశాలల్లో ప్రాథమీక విద్యతో పాటు వ్యాయామ విద్య తప్పనిసరి చేయాలని తెలుపుతు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే మౌళిక సదుపాయాలను మాత్రం ఏర్పాటు చేయడం మరిచింది. ఏళ్లు గడుస్తున్నా పలు పాఠశాలల్లో మాత్రం మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

  మండలంలోని ఆని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి దాదాపు 5వేల 4 వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 7 ఉన్నత పాఠశాలల్లో కస్తూర్బా, మోడల్‌స్కూల్‌లతో కలిపి విశాలమైన క్రీడా మైదానాలు లేక పోవడంతో విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరమవుతున్నారు. గతంలో ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినా అది ఆచరణకు నోచుకోవడం లేదు.

  పాఠశాలలో పీఈటిలు లేక పోవడంతో విద్యార్థులు ఆటలు ఆడే పరిస్థితి కనిపించడంలేదు. అటు పీఈటిలు ఇటు క్రీడా మైదానాలు లేక పోవడంతో ఆటలు ఎలా ఆడిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాయామవిద్యకోసం సమయాన్ని కెటాయిస్తున్నా విద్యార్థులకు మాత్రం ఒరిగిందేమి లేదు.

  క్రీడలకు అవసరమైన నిధులు కెటాయించిక పోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగలేక పోతున్నారు.  ఆయా పాఠశాలల్లో మైదానాలు లేక విద్యార్థులు ఉన్న చోటే ఆడుకుంటున్నారు. విద్యార్థులను శారీరకంగా , మానసికంగా ఎదిగేందుకు క్రీడలు దోహదం చేస్తాయి. విద్యార్థుల అవసరాలను దష్టిలో ఉంచుకొని ఖాళీగా ఉన్న పీఈటి పోస్టులను భర్తి చేస్తు, క్రీడా మైదాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

  ప్రభుత్వ నిభందనల ప్రకారం 250 మంది విద్యార్థులకు ఒక పీఈటి ఉండాలనే నిభందన అమలు కావడం లేదు. ప్రతీ ఏటా పాఠశాలలను మాత్రం అప్‌గ్రేడ్‌ చేస్తున్నా పీఈటీలను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఆటలలో రాణించలేకపోతున్నారు. గతంలో నిర్వహించిన మండల, తాలుకా, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా