నాట్లకు ఇబ్బంది రానివ్వం

2 Aug, 2016 22:20 IST|Sakshi
నాట్లకు ఇబ్బంది రానివ్వం
  • ఎస్సారెస్పీ నీటితో ఎల్‌ఎండీని నింపుతాం
  • అవసరమైతే చెరువులు, కుంటలకు నీళ్లిస్తాం 
  • నేటినుంచే నీటిని విడుదల చేస్తున్నాం.. 
  • సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం 
  • వైద్యులు, సిబ్బంది సెలవులు రద్దు చేశాం 
  • 15 రోజుల్లోగా మరో 2కోట్ల మెుక్కలు నాటుతాం 
  • దళితులకు భూమి ఇద్దామంటే అమ్మేవాళ్లు లేరు
  • మంత్రి ఈటల రాజేందర్‌
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో నాట్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా రైతాంగానికి భరోసా ఇచ్చారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ, కాకతీయ కాల్వ ద్వారా ఎల్‌ఎండీ, మధ్యమానేరు రిజర్వాయర్లకు బుధవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అవసరాల మేరకు ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలను నింపి పంటలను కాపాడుతామన్నారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ లక్ష్యాన్ని మించి 4.5 కోట్ల మొక్కలు నాటనున్నామని చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో నీళ్లు కలుషితం కాకుండా ప్రతిరోజు క్లోరినేషన్‌ చేయాలని, పీహెచ్‌సీల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలివీ. 
     
    సాక్షి : ఎస్సారెస్పీ నిండకుండానే నీటిని విడుదల చేయడానికి కారణమేంటి?
    ఈటల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఎస్సారెస్పీ నిండనేలేదు. మొన్నటి వర కైతే జిల్లాలో భయంకరమైన పరిస్థితి ఉండేది. భూగర్భ జలాలు అడుగంటినయ్‌. బోర్లు, బావులు ఎండిపోయినయ్‌. పశువులు తాగడానికి నీళ్లు లేకుండే. ఇప్పుడిప్పుడే బాగా వానలు పడుతున్నయ్‌. రాష్ట్రం వచ్చాక తొలిసారి ఎస్సారెస్పీ నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 44 టీఎంసీల నీరుంది. ఎగువన ఇంకా వానలు పడుతున్నందున 50 టీఎంసీల వరకు నీళ్లు వచ్చే అవకాశముంది. నిబంధనల ప్రకారం 40 టీఎంసీలుంటే తాగునీటికే నీరు వదలాలి. కానీ వానలు పడతాయనే నమ్మకంతో ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నం. బుధవారం ఉదయం 11 గంటలకు నేను, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పోచంపాడులో పూజలు నిర్వహించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ, కాకతీయ కాలువల ద్వారా ఎల్‌ఎండీకి విడుదల చేస్తాం. 
     
    సాక్షి : ఎల్‌ంఎడీ నిండాక చెరువులు, కుంటలు నింపుతారా?
    ఈటల : ప్రస్తుతానికైతే నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానివ్వం. రైతులకు అవసరమైన మేరకు సాగు నీరందిస్తాం. అవసరాన్ని బట్టి చెరువులు, కుంటలు కూడా నింపుతం. ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండుతోంది. ఇప్పటికే 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాబట్టి నాట్లకు ఏమాత్రం ఇబ్బంది రానీయం.
     
    సాక్షి : కాకతీయ కెనాల్‌ ఆధునికీకరణ పనులు పూర్తయినట్లేనా? 
    ఈటల : గతంలో ఎన్నడూ లేనంతగా ఎల్‌ఎండీ ఎగువన, దిగువన రూ.200 కోట్లు ఖర్చు చేసి కాకతీయ కెనాల్‌ కెపాసిటీని పెంచినం. వరంగల్‌ జిల్లాలో కొంత పని మినహా దాదాపు కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయినయ్‌. 
     
    సాక్షి : సీజనల్‌ వ్యాధుల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? 
    ఈటల : డాక్టర్లకు సెలవులు రద్దు చేసినం. మంచి కండీషన్‌లో ఉన్న 108 వాహనాలను ఏజెన్సీ, మారుమూల గ్రామాల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించినం. ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాలని చెప్పినం. వానాకాలంలో పాముకాటుకు గురయ్యే అవకాశాలున్నందున ఆసుపత్రుల్లో ఆయా మందులను సిద్ధంగా ఉంచాలని సూచించినం. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున క్లోరినేషన్‌ తప్పకుండా చేయాలని, అందుకు కేటాయించిన సొమ్మును దానికి మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసినం. అట్లాగే ప్రతి రోజూ  హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించినం. జిల్లాలో మరణాలుంటే ఎందుకు చనిపోయారో తప్పనిసరిగా కారణాలు వెల్లడించాలి. జిల్లాలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ముందుల కోసం తగిన నిధులు విడుదల చేసినం. నిధుల వ్యయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్లకే సర్వధికారాలిచ్చినం. 
     
    సాక్షి : జిల్లాలో హరితహారం లక్ష్యం నెరవేరలేదు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం పెంచాలని సీఎం చెబుతున్నారు కదా!
    ఈటల : జిల్లాలో ఇప్పటివరకు రెండున్నర కోట్ల మొక్కలు నాటినం. ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఇప్పటికే నర్సరీల్లో 75 లక్షల టేకు, ఇరవై లక్షల పండ్ల, పది లక్షల ఈత, మరో పది లక్షల యూకలిప్టస్‌ సహా మొత్తం కోటిన్నర మొక్కలు అందుబాటులో ఉన్నయ్‌. వచ్చే పదిహేను రోజుల్లో ఇంకా రెండు కోట్ల మొక్కలు నాటుతం. ఎమ్మెల్యేలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేస్తున్నం. కరీంనగర్‌ జిల్లాలో హరితహారం ముగింపు లేదు. నిరంతరం కొనసాగిస్తాం. ఖాళీ స్థలం కన్పిస్తే మొక్కలు నాటుతం. గుట్టల, వాగుల పక్కన, రోడ్లకు ఇరువైపుల, అడవుల్లో, చెరువు శిఖం భూములుసహా ప్రతిచోట మొక్కలు నాటుతం. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించాలని ఇప్పటికే తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినం. అధికారులు ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉన్నరు. 
     
    సాక్షి : మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్‌ బెడ్రూం ఇండ్లు, దళితులకు భూపంపిణీ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు కదా?
    ఈటల : అట్లేం లేదు. వాస్తవానికి మొన్నటివరకు తాగడానికి నీళ్లకే ఇబ్బంది ఉండే. ఇప్పుడిప్పుడే మంచిగ వానలు పడుతున్నయ్‌. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్‌ అవుతోంది. అట్లాగే దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉంటే ఆ మేరకు దళితులకు ఇస్తామని చెప్పినం. ఆ మేరకు భూములు కొనుగోలు చేసి దళితులకు ఇస్తున్నం. ఇల్లంతకుంట మండలంలో 500 ఎకరాల భూమి కొనిచ్చినం. గ్రామాల్లో రైతులు భూములను సోషల్‌ స్టేటస్‌గా భావిస్తున్నందున ఎవరూ అమ్మేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ భూములు లేవు. ఎవరైనా భూములను అమ్మడానికి ముందుకొస్తే వాటిని కొనుగోలు చేసి దళితులకు అందజేస్తున్నం. 
     
    సాక్షి : ప్రాజెక్టులకు భూసేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారినట్లుంది?
    ఈటల : ఎవరు ప్రాజెక్టులు కట్టాలన్నా భూమి మీదే తప్ప ఆకాశంలో కట్టలేరు కదా! ప్రాజెక్టులు కడితే భూములు మునగక తప్పదు. అందుకు కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రాజెక్టులు నిర్మిస్తే లక్షలాది మంది బతుకులు బాగుపడుతయ్‌. దయచేసి ప్రతిపక్షాలు భూసేకరణపై రాద్ధాంతం చేయకుండా నిర్మాణాత్మక సూచనలిస్తే స్వీకరిస్తం. ప్రజలకు అన్యాయం చేయడం మా ప్రభుత్వ అభిమతం కాదు. రాష్ట్ర ప్రజలకు నీళ్లివ్వడమే మా లక్ష్యం. 
>
మరిన్ని వార్తలు