నైరుతి ముఖం చాటేసింది..!

1 Jul, 2013 05:07 IST|Sakshi

పాలమూరు, న్యూస్‌లైన్: నైరుతి ముఖం చాటేసింది..! గతేడాది మాదిరిగానే వర్షాలకోసం రైతాంగం ఎదురుచూడటం ప్రారంభమైంది. అడపాదడపా కురిసిన వర్షాలకు నారుమళ్లు వేసుకునేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. వరిసాగుచేపట్టిన రైతులు ఏటా పెరుగుతున్న సాగుభారాన్ని భరిస్తూనే ఆశించిన దిగుబడి రాక, తగిన మద్దతుధర లభించక అప్పులబాధతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం రెండురోజుల క్రితం ప్రకటించిన వరికి మద్దతు ధరపై జిల్లారైతాంగం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
 
 విత్తనాల నుంచి ఎరువులు, కూలీల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో పెంచిన మద్దతుధర అన్నదాతకు నిరాశే మిగిల్చింది.. ఈసారి ప్రభుత్వం వరి మద్దతుధర సాధారణ రకం క్వింటాలుకు రూ.60, ‘ఏ’ గ్రేడ్‌కు రూ.65 పెంచింది. దీనివల్ల సాధారణ రకం ధాన్యం ధర రూ.1,310, ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యం రూ.1345కు పెరిగింది. అయితే 2012-13 సంవత్సరంలో ప్రభుత్వం క్వింటాలుకు రూ.170 పెంచిన తీరుతో పోల్చి చూస్తే ఈసారి ప్రకటించిన మద్దతుధర సర్వత్రా నిరాశకు గురిచేసింది.
 
 పెరిగిన సాగుఖర్చులు
 సాగుఖర్చులు, మద్దతు ధరలతో పోల్చితే రైతులు ఆర్థికనష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వామినాథన్ నివేదిక ప్రకారం ఉత్పత్తి వ్యయం కంటే 50శాతం అదనపుధర చెల్లించాలనే సిఫార్సులను ప్రభుత్వం పెడచెవిన  పెట్టింది. జిల్లాలో 88, 331వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగవుతుంది.
 
 గతేడాదికంటే పెట్టుబడి వ్యయం ఎకరానికి ఆరువేల నుంచి ఏడువేల వరకు పెరిగిందని అంచనావేస్తున్నారు. ఖరీఫ్‌లో ఎకరా సగటు దిగుబడి 20 క్వింటాలుగా లెక్కించారు. ఈ ప్రకారంగా చూస్తే మద్దతు వల్ల ఎకరానికి రూ.1,200 వస్తుండగా.. పెట్టుబడి మాత్రం ఆరువేలకు మించిపోయింది. దీనిప్రకారం చూస్తే ఎకరానికి రైతులు రూ.5000 నుంచి రూ.6000వేలు నష్టపోవాల్సి వచ్చింది. పెరిగిన అదనపు పెట్టుబడిని ఎకరానికి సగటున రూ.6,500 ప్రకారమే లెక్కిస్తే జిల్లారైతాంగం రూ.394.87 కోట్ల భారం మోయాల్సివచ్చింది.
 
 కంటితుడుపు చర్య
 క్వింటాలు ధాన్యానికి రూ.2,811 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తే కేవలం రూ.1345 ‘ఏ’ గ్రేడ్ ధర పెంచడం కంటితుడుపు చర్యగా రైతులు భావిస్తున్నారు. రైతుసంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిపోయింది. రైతు సంఘాలు, ప్రభుత్వం నియమించిన సంఘాలు అన్నదాత ఆవేదనపై ఆక్రోశిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే భూముల ధరలు పెరిగిపోవడం.. పంటకు గిట్టుబాటు ధర రాక భూములను విక్రయించేందుకు అన్నదాతలు సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం నాలుగు కాలాలపాటు కొనసాగాలంటే ప్రభుత్వపరంగా కూడా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 
 బియ్యం ధరలపై నియంత్రణేది?
 బియ్యం ధరలపై ప్రభుత్వం నియంత్రణ కొరవడింది. కిలోపై నాలుగు నుంచి ఐదురూపాయలు పెరిగాయి. సన్నరకం బియ్యం ధరలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. నాణ్యమైన బియ్యం ధర మార్కెట్‌లో చుక్కల్ని తాకింది. ధాన్యానికి స్వల్పంగా పెంచిన మద్దతుధర వల్ల మరోసారి వ్యాపారులు మార్కెట్‌లో లాభపడే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్‌తో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు