నాణ్యతకు చెల్లుచీటీ!

11 Sep, 2016 20:36 IST|Sakshi
పెచ్చులూడుతున్న ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవనం
  • ఇష్టానుసారంగా సమీకృత వసతిగృహ భవన నిర్మాణం
  • ఇసుకకు బదులు రాతి పౌడర్‌ వినియోగం
  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ
  • కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా
  • మెదక్‌: సమీకృత వసతి గృహ భవన నిర్మాణంలో నాణ్యతకు మంగళం పాడుతున్నారు. సిమెంట్, ఇసుకతో నిర్మించాల్సిన భవనాన్ని చౌకగా లభించే రాతి పౌడర్‌ను కలిపి నిర్మాణాలు సాగిస్తున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన ఈ భవనం ఎన్నాళ్లపాటు ఉంటుందో ఎవరికి అంతుబట్టని ప్రశ్న. అదే సమయంలో కోట్లాది రూపాయల ప్రజాధనం మట్టిపాలవుతుంది.

    మెదక్‌ పట్టణంలోని జంబికుంట ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో ఈ మూడు వర్గాలకు చెందిన హాస్టళ్లను ఒకేచోట సమీకృత వసతి గృహ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.2.27కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఆన్‌లైన్‌ ద్వారా చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

    భవన నిర్మాణానికి నాణ్యమైన ఇసుకతోపాటు సిమెంట్‌ కలిపి నిర్మిస్తారు. కాని ఈ కాంట్రాక్టర్‌ మాత్రం ఇసుక సిమెంట్‌తోపాటు రాతి పౌడర్‌ను సైతం కలుపుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. కాంట్రాక్టర్‌ ఓ వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు.

    గోడలు, మరుగుదొడ్లను మాత్రమే నిర్మిస్తున్నామని సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఇంతపెద్ద భవనాన్ని నిర్మిస్తున్న సంబంధిత శాఖ అధికారులు అక్కడ లేకపోవడం గమనార్హం. ఈ భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేద విద్యార్థులు వందలాది మంది వసతి పొందుతారు. ఇంతటి ప్రాధాన్యత గల భవన నిర్మాణంపై నిర్లక్ష్యపు నీడలుకమ్ముకున్నాయి.

    మార్కెట్‌లో అతి చౌకగా లభించే రాతిపౌడర్‌ చూడటానికి సిమెంట్‌లాగే ఉంటుంది. అందులో ఎంతపౌడర్‌ కలిపినా గుర్తించేందుకు వీలుకాదు. సిమెంట్, ఇసుకతో నిర్మిస్తేనే ఏ భవన నిర్మాణమైనా పదికాలాలపాటు మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కానీ రాతిపౌడర్‌ను కలిపితే నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు.

    ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ విషయమై విద్యాశాఖ ఏఈ అంసర్‌ అలీని సాక్షి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు