కరుణించని మేఘాలు.. కురవని వానలు

27 Jul, 2016 18:35 IST|Sakshi
కరుణించని మేఘాలు.. కురవని వానలు
 
  • అడుగంటిన భూగర్భజలాలు
  • ముదురుతున్న వరినారు
  • ఆందోళనలో అన్నదాతలు
  • నిరాశగా ఖరీఫ్‌ సాగు
ముస్తాబాద్‌ కమ్ముకొచ్చే నల్లని మేఘాలు.. ఆహ్లాదం పంచే చల్లని వాతావరణం.. చినుకులు కురవని రోజు లేదు.. చెరువులు, కుంటలు నిండేదిలేదు.. ఇది ప్రస్తుత ఖరీఫ్‌ పరిస్థితి. ఇది వానకాలపు పంటల సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అన్నదాతలు సాధారణ స్థాయిలోనూ సాగుకు ఉపక్రమించలేదు.
 
ఎత్తిపోయిన ఎగువ మానేరు ప్రాజెక్టు..
ఎగువ మానేరు ప్రాజెక్టు దాదాపు డెడ్‌ స్టోరెజీకి చేరింది. 32 అడుగుల నీటి మట్టం గల ప్రాజెక్టులో ప్రస్తుతం రెండు అడుగుల నీరు కూడా లేదు. మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురవక కూడవెల్లి, పలాంచవాగుల్లోకి చుక్కనీరు చేరలేదు. ఫలితంగా ప్రాజెక్టు ఆయకట్టు 16 వేల ఎకరాలు బీడుగానే ఉంది. ఒక్క ముస్తాబాద్‌లోనే పదివేల ఎకరాల ఆయకట్టు ప్రాజెక్టుకింద ఉంది. భూగర్బజలాలు లేక ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్‌ సాగుపై ఆందోళన నెలకొంది. ప్రధాన చెరువులైన ఆవునూర్, నామాపూర్, బందనకల్, ముస్తాబాద్, గూడెం, కొండాపూర్, చీకోడు, చిప్పలపల్లి, తెర్లుమద్ది గ్రామాల్లో ఒక్కచెరువు కూడా నీటితో నిండలేదు. మరోరెండు నెలలే వర్షాకాలం ఉంది. ఇప్పటికే సాగు అదను దాటిపోయింది. దీంతో ఖరీఫ్‌పై అన్నదాతలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ప్రత్యామ్నాయం వైపు చూపు..
ఆశించిన మేరకు వర్షాలు కురవక రైతులు ఈసారి వరి, పత్తి సాగుకు దూరంగా ఉన్నారు. అయితే ఆరుతడి పంటలు వేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కూరగాయలు, మినుము, పెసర, కంది, సోయా, మొక్కజొన్న వంటి పంటలు సాగుతో వర్షాభావాన్ని అధిగమించవచ్చని చెబుతున్నారు.
ముస్తాబాద్‌లో వర్షపాతం వివరాలు(మి.మీ.లలో..)
నెల సాధారణం నమోదైనది
జూన్‌ 126.2 130.4
జూలై 177.9 206.8
మండలంలో సాగు విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో..)
పంట సాధారణం సాగైంది
వరి 2770 2285
పత్తి 2722 2120
మొక్కజొన్న 457 510
కంది 121 485
పెసర 140 157
 
మరిన్ని వార్తలు