‘వాన’ దేవుడా!

4 Aug, 2016 23:11 IST|Sakshi
  • చేగుంటపై పగబట్టిన వరుణుడు!
  • సాగుకు, తాగుకు తప్పని నీటి కష్టాలు
  • 30 శాతానికే పరిమితమైన వరి సాగు
  • బోసిపోయిన చెరువులు, కుంటలు
  • అత్యంత లోతుకు పడిపోయిన నీటి మట్టాలు
  • ఆందోళనలో రైతులు, జనం
  • చేగుంట: మండల ప్రజలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక సాగు పనులు సాగక అటు రైతులు, తాగేందుకు నీరు దొరక్క ఇటు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణలోనే భూగర్భ జలాలు అత్యధికంగా పడిపోయిన పది మండలాల్లో చేగుంట ఒకటి. వానలు లేక, బోరుబావుల్లోని నీరు సైతం అత్యంత లోతుకు పడిపోయాయి. నీరు లేక రైతులు పంటలకు దూరంగా ఉంటున్నారు. కనీసం 30 శాతం కూడా వరి సాగులోకి రావడం లేదు. మిగతా ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా ఒక్క చేగుంటలోనే వరుణుడు పగబట్టినట్టు ఉన్నాడు. వానల కోసం ఈ ప్రాంత రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తూ కాలం గడుపుతున్నారు.

    వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భ జలమట్టాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో సాగుకు, తాగు నీటికి కష్టాలు ఎదురవుతున్నాయి. వరుసగా రెండేళ్లపాటు తగిన వర్షపాతం నమోదు కాకపోవడంతో మండలంలో కరువు ఛాయలు అలుముకున్నాయి.గత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం సాధారణం కన్నా తక్కువగా నమోదు కావడం ఈ సారి కూడా సరైన వర్షాలు లేకపోవడంతో కనీసం 30 శాతం కూడా వరిసాగు చేయలేకపోయారు. గత ఏడాది జూలై నెలాఖరుకు 398 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.

    ఈ ఏడాది జూలై చివరి నాటికి 401 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 248 మిల్లీ మీటర్లే కురిసింది. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వేయాల్సిన వరి నాట్లు ఆలస్యం కావడంతో మడుల్లోనే వరి నారు ముదిరి పోయే దశకు చేరుకుంది. గత ఏడాది వర్షాభావంతో ఎక్కడా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకోక పోవడంతో భూగర్భ జలాలు పైకి రాకపోవడంతో వ్యవసాయ బోర్లతోపాటు తాగునీటికి ఇతర అవసరాలకు ఉపయోగపడే బోరుబావుల్లో నీరు అడుగంటి పోయింది. చిన్నశివునూర్‌, పెద్దశివునూర్, రాంపూర్, పోతాన్‌పల్లి గ్రామాల్లో వరి పంటలు ఎండిపోవడంతో పశువులను మేపాల్సిన పరిస్థితి నెలకొంది.

    తగ్గుతున్న పంటల సాగు విస్తీర్ణం
    గత ఏడాది ఖరీఫ్‌లో 2,200 హెక్టార్లలో వరి వేసుకోవాల్సి ఉండగా 1,700 హెక్టార్లలో, 6 వేల హెక్టార్లలో వేసుకోవాల్సిన మొక్కజొన్న 4 వేల హెక్టార్లలో మాత్రమే వేశారు. గత ఏడాది రబీలో నీటి కొరతతో ఆరుతడి పంటలనే సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2,200 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 630 హెక్టార్లలోనే వరి నాట్లు వేసినట్టు అధికారులు తెలిపారు. 4,500 హెక్టార్లలో మొక్కజొన్న పంట వేయగా చివరి వరకు వర్షం సహకరిస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    బోర్లపై నిషేధం ఉన్నా...
    చేగుంట పట్టణంలో బోరుబావుల్లో 500 ఫీట్ల వరకు, గ్రామాల్లో 400 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడతాయనే నమ్మకం లేదు. బోరు బావుల తవ్వకంపై నిషేధం ఉన్నా రిగ్గు యజమానులు  గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఎడాపెడా బోరుబావులను తవ్వుతున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడే జరిమానా విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వర్షాకాలంలోనూ మండలంలోని చాలా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేయాల్సిరావడం నీటి ఎద్దడికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆగస్టు మొదటి వారానికి చేరుకున్నా సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు బోసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు తప్పకపోవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు.

    ఇంతటి కరువు ఎన్నడు చూడలే...
    2002లో వర్షాలు కరువై పంటలకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. మళ్లీ ఇప్పుడు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నం. మా పొలంలో గత ఏడాది సగం పంట మాత్రమే పండించగా ఈసారి ఇంకా వరి నాట్లు ప్రారంభించలేదు. ఈ పదిహేను రోజుల్లో వర్షం కురువకుంటే వరి పంటలకు కష్టకాలమే. - గడ్డమీద రాములు రైతు, చేగుంట

    ఆరుతడికీ నీరు కరువే
    మా గ్రామంలో భూగర్భ జలాలు పడిపోవడంతో ఆరుతడి పంటలు వేశాం. జూన్‌లో కూరగాయల పంటలను వేసుకొని తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించాలని ప్రయత్నించినా వర్షాలు లేక బోర్లలో నీరు రావడంలేదు. నీటి కష్టంతో ఆరుతడి పంటలు సైతం సరిగ్గా దిగుబడి వస్తాయో లేదో అని భయపడుతున్నాం. - మహిపాల్‌రెడ్డి, రైతు, గొల్లపల్లి
     

మరిన్ని వార్తలు