ప్రజా ప్రతినిధులా అయితే మాకేంటి?

3 Feb, 2017 22:34 IST|Sakshi
ప్రజా ప్రతినిధులా అయితే మాకేంటి?

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాచర్ల పాడు ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో ఏర్పాటైన గమేసా కార్పొరేట్‌ కంపెనీ స్థానిక ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం గౌవరం ఇవ్వలేదు. కర్మాగారం, పరిపాలనా భవనాల ప్రారంభోత్సవానికి శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ సందర్భంగా  ఆ సంస్థ ముద్రించిన ఆహ్వాన పత్రికలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతిధులెవరికీ చోటు దక్కలేదు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు మాత్రమే స్థాపించాల్సిన కిసాన్‌సెజ్‌లో ప్రభుత్వ పెద్దల అండతో గమేసా కంపెనీ 150 ఎకరాల భూమి సంపాదించింది. పవన విద్యుత్‌ ఉత్పత్తి బ్లేడ్లు(రెక్కల) తయారీ కర్మాగారం ప్రారంభించింది. ఈ కర్మాగారం ఏర్పాటే  సెజ్‌ నిబంధలకు విరుద్ధం. ఇదిలా ఉంటే ఇక్కడ  ఎనిమిది రసాయనిక ఉత్పత్తుల తయారీ కోసం గమేసా సంస్థ కాలుష్య నివారణ సంస్థ నుంచి అనుమతి తెచ్చుకుని వీటి ఉత్పత్తి ప్రారంభానికి అడుగులు వేస్తోంది. ఇక్కడి రైతుల భూమి తీసుకుని, గాలిని కలుషితం చేస్తూ నీటిని కొల్లగొట్టేలా గమేసాకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై రైతులు మండిపడుతున్నారు.

ఈ వివాదం హైకోర్టు వరకు చేరింది. రైతుల ఒత్తిడి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో గమేశా చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నోరు మూయించే ఎత్తుగడ వేసింది. హైకోర్టు స్టే ఉన్నా తమ కార్పొరేట్‌ పలుకుబడి ఉపయోగించి సీఎంను తీసుకు వస్తోంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల్సిన గమేసా సంస్థ వారిని అసలు లెక్కలోకే తీసుకోలేదు. ఆ సంస్థ మీడియాకు పంపిన ఆహ్వాన పత్రికల్లో  సీఎం చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కైమల్‌ పేర్లు మాత్రమే ముద్రించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా మంత్రి పి.నారాయణ, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి,  స్థానిక శాసనసభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్‌ చెముకుల శీనయ్య, ఎంపీపీ నల్లావుల వెంకమ్మ, జెడ్‌పీటీసీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మాణికెల చెంచమ్మ పేర్లు ముద్రించకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడింది. గమేశా వ్యవహార శైలిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా అందజేయలేదు.

అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కానందువల్ల  ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం లేదని ఇఫ్కో అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కార్పొరేట్‌ శక్తులు ప్రభుత్వాన్ని సైతం ఎలా శాసిస్తాయనేందుకు ఈ ఆహ్వానపత్రికే పెద్ద ఉదాహరణగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు