హెచ్చరిక బోర్డులు లేక నిత్యం ప్రమాదాలు

8 Apr, 2016 03:13 IST|Sakshi
హెచ్చరిక బోర్డులు లేక నిత్యం ప్రమాదాలు

జాతీయ రహదారిపై భద్రత కరువు
పటాన్‌చెరు: జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. ప్రధానంగా కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా తయారవుతున్నాయి. లింగంపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి వరకు పదేళ్ల క్రితం జాతీయ రహదారిని విస్తరించారు. రోడ్డు వెడల్పు చేసినా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. పలు చోట్ల రోడ్లు గుంతలుగా ఉండటం, మరికొన్ని చోట్ల రోడ్డు మధ్యలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా డివైడర్లు, వర్షపు నీరు పోయే కాలువలు ఉండటంతో రాత్రి వేళలో అవి కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇస్నాపూర్ చౌరస్తాలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గరికి వెళ్లే వరకు కనిపించదు.

అదేవిధంగా ఇక్రిశాట్ సమీపంలోని ఐలా కార్యాలయం సమీపంలో రోడ్డు మధ్యలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా వర్షపు నీరు పోయే కాలువ ఉండటంతో వాహనదారులు దానిపై వెళ్తూ తీవ్ర గాయాలబారిన పడుతున్నారు. ఇది ప్రమాదకరంగా ఉందని అనేక మార్లు అధికారులకు స్థానికులు మొరపెట్టుకున్నా వారు పట్టించుకున్న పాపానపోవడం లేదు. దీంతో నిత్యం భారీ వాహనాలు డివైడర్లపైకి దూసుకుపోతూ ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాయి. పలు చౌరస్తాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో కొంత మంది యూ టర్న్ తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రాత్రి వేళల్లో కనిపించడం లేదు
రాత్రి వేళల్లో వాహనాలు నడిపించేప్పుడు జాతీయ రహదారిపై డివైడర్లు కనిపించడం లేదు. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వారవుతారు. - అబ్బు

మరిన్ని వార్తలు