ఒక్కరి కోసం!

14 Sep, 2016 00:39 IST|Sakshi
ఒక్కరి కోసం!
 
  • 3 నెలలుగా 59 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేత
  • ఓ ఎస్‌జీటీ అక్రమ పదోన్నతే కారణమన్న ట్రెజరీ అధికారులు
  • విచారణకు ఇంటలిజెన్స్‌ బృందం రంగ ప్రవేశం
 
నెల్లూరు, సిటీ : కేవలం ఒక్క ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది ఉపాధ్యాయులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళణ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 15 మున్సిపల్‌ పాఠశాలల్లో ఈ ఏడాది జూన్‌ నెలలో డీఎస్‌సీ–2014 ద్వారా 59 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యారు. వీరు విధుల్లో చేరి మూడు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లింపులు మాత్రం జరగలేదు. నగరపాలక వైవీఎం పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ(ఫిజికల్‌ సైన్స్‌) ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది జీతాలు నిలిచిపోవడం గమనార్హం. 
అసలు ఏమి జరిగిందంటే 
నగరపాలక సంస్థ పరిధిలోని వైవీఎం పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని 2015లో అక్రమ పదోన్నతిపై స్కూల్‌అసిస్టెంట్‌గా అప్పటి కమిషనర్‌ నియమించారు. క్యాడర్‌ స్టెంత్‌ పరిశీలించకుండా ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా నియమించారు. ప్రతి విషయంలో మీనమేషాలు లెక్కించే అధికారులు ఈ అక్రమ పదోన్నతిలో మాత్రం హుటాహుటిన ముందూ వెనకా చూడకుండా పదోన్నతి కల్పించారు. అయితే ఇటీవల డీఎస్సీ–2014 ద్వారా చంద్రకళ అనే మహిళా ఉపాధ్యాయురాలు ఫిజికల్‌ సైన్స్‌ పోస్ట్‌కు నియామకమైంది. కార్పొరేషన్‌ పరిధిలోని పాఠశాలల్లో ఫిజికల్‌ సైన్స్‌ పోస్ట్‌లు 27 ఉన్నాయి. అయితే ఓ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి కారణంగా 28 మందికి జీతాలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్‌ అధికారులు 28 మంది ఫిజికల్‌సైన్స్‌ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ట్రైజరీ డిపార్ట్‌మెంట్‌ను కోరారు. అయితే నిబంధనల ప్రకారం 27 పోస్ట్‌లు ఉంటే 28 ఏ విధంగా జీతాలు చెల్లించాలని కార్పొరేషన్‌ అధికారులు పంపిన ఫైల్‌ను వెనక్కు పంపారు. దీంతో గత మూడు నెలల నుంచి 59 మంది జీతాలు నిలిచిపోయాయి. 
అక్రమ పదోన్నతి  వెనుక ఓ ఎమ్మెల్సీ
అక్రమ పదోన్నతి పొందిన ఆ ఉపాధ్యాయుని వెనుక ఓ ఎమ్మెల్సీ ఉన్నట్లు సమాచారం. ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో అక్రమ పదోన్నతికి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు చేసిన ఘోరమైన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌టీ(గణితం) బ్యాక్‌ లాగ్‌ పోస్ట్‌ ఖాళీగా ఉండడంతో ఆ ఉపాధ్యాయుడిని గణితం ఉపాధ్యాయుడిగా నియమించేందుకు ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ఎస్‌టీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడి కోసం ఆ పోస్ట్‌ను ఖాళీగా ఉంచారు. అయితే అధికారులు గణిత ఉపాధ్యాయుడి పోస్ట్‌లో నియమించి, అక్రమ పదోన్నతిని సక్రమం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఓ బలమైన ఉపాధ్యాయ సంఘం మాత్రం ఆ ఉపాధ్యాయుడికి బాసటగా నిలుస్తున్నట్లు సమాచారం. 
విచారణ చేపట్టిన ఇంటిలిజెన్స్‌ బృందం 
అక్రమ పోస్టింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఇంటిలిజెన్స్‌ బృందం కూడా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కార్పొరేషన్‌ అధికారులను, పలువురు ఉపాధ్యాయులను ఇంటిలిజెన్స్‌ బృందం ప్రశ్నించారు. 
 
అక్రమ పదోన్నతి రద్దు చేయాలి
అక్రమ పదోన్నతిని రద్దు చేసి, 59 ఉపాధ్యాయులకు వెంటనే వేతనం చెల్లించాలి. కార్పొరేషన్‌ అధికారులు అక్రమాలను ప్రోత్సహించకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. త్వరగా అక్రమ పదోన్నతిని రద్దు చేయకపోతే ఆందోళణ చేసేందుకు వెనుకాడబోం.
–ఎన్‌.మోహన్‌దాస, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌
మరిన్ని వార్తలు