జీతమెప్పుడొస్తుంది బాబో!

10 May, 2016 17:25 IST|Sakshi


 జీతాల కోసం గెస్ట్ ఫ్యాకల్టీల ఎదురుచూపు
 జిల్లాలో 59 మంది అధ్యాపకుల నియామకం
 విద్యా సంవత్సరం ముగిసినా పట్టించుకోని ప్రభుత్వం

 
కర్నూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేసిన అధ్యాపకులకు వేతనాలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్న పైసా చెల్లించలేదు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గెస్టు ఫ్యాకల్టీకి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తే చాలా వాటిలో అంత మొత్తంలో డబ్బులు లేవని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు.  కర్నూలు జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. చాలా కళాశాలల్లో అధ్యాపకులు లేరు. రెండేళ్లుగా కాంట్రాక్ట్ బేసిక్‌పై కూడా అధ్యాపకులను నియమించడం లేదు. ఈ నేపథ్యంలో కళాశాలలో ఇంటర్ విద్య మిథ్యగా మారకూడదని ప్రభుత్వం సెప్టెంబర్, నవంబర్ నెలల్లో 59 మందిని గెస్టు ఫ్యాకల్టీలుగా నియమించింది. పిరియడ్‌కు రూ. 150 చొప్పున 68 పిరియడ్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అంతకన్న ఎక్కువ పిరియడ్లను తీసుకుంటే రూ. పది వేలకు మించకుండా చెల్లిస్తారు. పీజీలు చేసి నిరుద్యోగులుగా ఉన్న యువకులు ఆర్థిక ఇబ్బందులు కలుగతాయనే ఆశతో గెస్టు ఫ్యాకల్టీగా చేరారు. నెలనెలా గౌవర వేతనాన్ని చెల్లిస్తుందనుకుంటే ఆరు నెలలైనా పైసా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యారు. విద్యా సంవత్సరం ముగిసినా అధికారులు గౌవర వేతనం మాటెత్తకపోవడంతో ఆయోమయంలో ఉన్నారు.
 
స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి చెల్లించాలని ఆదేశాలు:
మరోవైపు గెస్ట్ ఫ్యాకల్టీలకు కళాశాలల స్పెషల్ ఫీజు అకౌంట్ల నుంచి గౌరవ వేతనాలు చెల్లించాలని సోమవారం ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే చాలా కళాశాలల్లో అంత పెద్ద మొత్తంలో నిధులు లేవని, అలాంటి కళాశాలల్లో పనిచేసిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు.
 
పది రోజుల్లో చెల్లిస్తాం: కబీరు, డీవీఈఓ
గెస్టు ఫ్యాకల్టీలుగా పనిచేసే వారికి స్పెషల్ ఫీజు మొత్తాల నుంచి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం సోమవారం ప్రొసిడింగ్స్‌ను ఇచ్చింది. వారం, పది రోజుల్లో ఇచ్చేస్తాం. అయితే ఏయే కాలేజీలో ఎంత అమౌంటు ఉందో ముందు చూడాలి. తక్కువ మొత్తం ఉంటే మళ్లీ ప్రభుత్వానికి నివేదించాలి. స్పెషల్ ఫీజు గ్రాంట్లు ఉన్న కళాశాలల అధ్యాపకులకు చెల్లిస్తాం.  
 
 మార్చిలో ఇస్తామన్నారు: ఎల్ల రంగడు, కౌతాళం జూనియర్
నేను నవంబర్‌లో గెస్టు ఫ్యాకల్టీగా కౌతాళం జూనియర్ కళాశాలలో చేరాను. ఇంత వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. మార్చిలో ఇస్తామన్నారు. ప్రస్తుతం మే వచ్చింది. అయినా ఇంతవరకు ఎవరూ ఏమి అనడం లేదు. గెస్ట్ ఫ్యాకల్టీ అభ్యర్థులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విడుదల చేయాలి.
 
 
 
 

మరిన్ని వార్తలు