40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదు

23 Sep, 2016 02:00 IST|Sakshi
40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదు
 
  • మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌
  • మహ్మదాపురంలో వాటర్‌ ప్రాజెక్టు పరిశీలన
 
నెల్లూరు సిటీ: నగర ప్రజలకు రాబోయే 40 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పేర్కొన్నారు. సంగం మండలం మహ్మదాపురంలో రూ.580 కోట్లతో నిర్మిస్తున్న వాటర్‌ ప్రాజెక్టును గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు గానూ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పైప్‌లైన్‌ ద్వారా మహ్మదాపురం నుంచి నీటి సరఫరా అవుతుందన్నారు. అమృత్‌ నిధుల ద్వారా వచ్చే నిధులను మంచినీటికి, డ్రైనేజీ నిర్మాణానికి వాడాల్సి ఉండగా, ఆ నిధులను హడ్కోకు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ మోహన్, ఈఈ శ్రీనివాసులు, టీడీపీ కార్పొరేటర్లు మన్నెం పెంచలనాయుడు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, వహీదా, బొల్లినేని శ్రీవిద్య, పొత్తూరు శైలజ, మల్లికార్జున్‌యాదవ్, ప్రశాంత్‌కిరణ్, నాయకులు షంషుద్దీన్, జహీర్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.
33 మందిలో ఏడుగురు కార్పొరేటర్లే హాజరు
కార్పొరేషన్‌తో 33 మంది టీడీపీ కార్పొరేటర్లకు గానూ ఏడుగురే పరిశీలన నిమిత్తం మేయర్‌తో కలిసి వెళ్లారు. మేయర్‌పై వారిలో ఉన్న అసంతృప్తి మరోసారి రుజువైంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టు సందర్శనార్థం గురువారం ఉదయం ఓ ప్రైవేట్‌ ఆపరేటర్‌కు చెందిన రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లందరూ హాజరవుతారని భావించిన మేయర్‌కు ఏడుగురే హాజరవడంతో చుక్కెదురైంది. అక్కడ ఉన్న కార్పొరేటర్లు మేయర్‌పై అసమ్మతి చల్లారినట్లు లేదని చర్చించుకున్నారు. తప్పని పరిస్థితుల్లో మేయర్‌ ఒక బస్సును వెనక్కి పంపారు. ఒక బస్సులో మీడియా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పయనమయ్యారు.
మరిన్ని వార్తలు