వారెక్కాల్సిన రైలు ఆగలే...

30 Aug, 2017 22:19 IST|Sakshi

ఆమదాలవలసలో ఆగని స్పెషల్‌ ట్రైన్‌
అవాక్కయిన 25 మంది ప్రయాణికులు
చీపురుపల్లిలో 25 నిమిషాలపాటు నిలిపివేత
వెనుకనుంచి పాసింజర్‌ రైల్లో వచ్చి రైలు ఎక్కిన వైనం


చీపురుపల్లి: సాంకేతిక పరంగా రైల్వే ఎంతో అభివృద్ది చెందినప్పటికీ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రైల్వే అధికారుల పొరపాటో లేక సమాచారం లేకనో తెలియదు గాని మొత్తం మీద ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. రైల్వే అధికారుల పొరపాటు కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసలో 25 మంది ప్రయాణికులు రైలు ఎక్కక అవస్థలు చెందగా వారి కోసం స్పెషల్‌ రైలును చీపురుపల్లిలో 25 నిమిషాలు నిలిపి అందులో ఉన్న వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి. 07163 నంబరు గల హౌరా– సికింద్రాబాద్‌ రైలు మంగళవారం వచ్చింది. అందులో ఎక్కేందుకు ఆమదాలవలసలో 25 మంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకుని ఎదురు చూస్తున్నారు. సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో ఆ రైలు వచ్చినప్పటికీ ఆగలేదు.

కంగుతిన్న ప్రయాణికులు స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించారు. ఎలాగైనా తమను సికింద్రాబాద్‌ అదే రైలులో పంపించాలని ప్రయాణికులు పట్టుబట్టారు. స్టేషన్‌ మాస్టర్‌ ఉన్నత అధికారులతో చర్చించి ఆ స్పెషల్‌ రైలును చీపురుపల్లిలో నిలిపివేయించారు. అనంతరం అప్పటికే ఆలస్యంగా వస్తున్న పలాస– విశాఖపట్నం ఈఎమ్‌యూలో ప్యాసింజర్‌ రైలులో ఆ 25 మంది ప్రయాణికులను చీపురుపల్లి పంపించి హౌరా– సికింద్రాబాద్‌ రైలులో ఎక్కించారు. అంతవరకు చీపురుపల్లిలోనే ఆ రైలు నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా రైల్వే అధికారుల పుణ్యమాని వందలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డాదు. వాస్తవానికి ఆ రైలుకు ఆమదాలవలసలో హాల్టు లేదనీ అందువల్లే స్టేషన్‌ మాస్టర్‌కు గాని కంట్రోలర్‌కు గాని సాంకేతిక సమాచారం అందలేదని రైల్వే వర్గాలు  అభిప్రాయ పడుతున్నాయి. అయితే హాల్టు లేకుండా రిజర్వేషన్‌ ఎలా ఇచ్చారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు