ఆ ఆరుగురిదే హవా

11 May, 2017 23:19 IST|Sakshi
ఆ ఆరుగురిదే హవా
- డీసీ కార్యాలయంలో కొన్నేళ్లుగా వారే
- దేవాదాయం...వారికే... 
- ఏళ్లతరబడి తిష్ట వేసినా బదిలీలుండవు
- పై స్థాయిలో వాటాలతో కొనసాగింపు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం. కాకినాడ కేంద్రంగా ఆ శాఖ పని చేస్తుంటుంది. డీసీ కార్యాలయం మూడు జిల్లాలను పర్యవేక్షిస్తుంటుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో సుమారు మూడువేల ఆలయాలు, సత్రాలను ఈ కార్యాలయమే అజమాయిషీ చేస్తుంటుంది. ఈ కార్యాలయానికి డిప్యూటీ కమిషనర్‌ సుప్రీం. చాలా కాలంగా ఈ కార్యాలయం అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి డిప్యూటీ కమిషనర్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పైసలిస్తే పని కానిదంటూ ఏదీ ఉండదనే ఆరోపణ ఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగులపై ఉంది. అందుకే ఇక్కడి డీసీ కార్యాలయంలో పని చేయడమంటే ఎగిరి గంతేస్తారు. డీసీ కార్యాలయంలో ఒకసారి జాయినైతే ఇక కార్యాలయాన్ని అంటిపెట్టుకునే ఉంటారంటే అతిశయోక్తి కాదు.  జిల్లాలో ఏ శాఖలో అయినా చివరకు దేవాదాయశాఖ పరిధిలో ఇతర కార్యాలయాల్లోనైనా నిబంధనల ప్రకారం ఉద్యోగులకు బదిలీలు జరుగుతుంటాయి. కానీ ఈ కార్యాలయంలో ఏళ్లతరబడి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు బదిలీలు అంటే ఏమిటో తెలియదు. బదిలీలు జరిగే ప్రతి సందర్భంలో ఉన్నతాధికారులకు ‘ఆమ్యామ్యా’లు ఇచ్చేసి ఆ సీట్లలోనే కొనసాగుతున్నారంటే ఎంత పలుకుబడి ఉందో ఊహించుకోవచ్చు. 
డిప్యూటీలు ఎవరైనా సరే వీరిదే స్టీరింగ్‌...
డిప్యూటీ కమిషనర్‌గా ఎవరు వచ్చినా చక్రం తిప్పేది మాత్రం ఆ ఆరుగురే. ఈ కార్యాలయంలో అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 20 మంది ఉంటారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మూడేళ్లు పైబడితే బదిలీలు తప్పవు. పాతికేళ్లవుతున్నా బదిలీ కాని ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు.  
- కార్యాలయంలో అటెండర్‌గా జాయినైన ఒక ఉద్యోగి ఇక్కడే  రికార్డు అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగాడు. ఆ ఉద్యోగి ఇక్కడ 27 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 
- 2004లో టైíపిస్టుగా జాయినైన ఒక ఉద్యోగి అప్పటి నుంచి ఇప్పటి వరకు టైపిస్టుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. 
- మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌æ 11 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. 
- 1999లో జూనియర్‌ అసిస్టెంట్‌గా జాయినైన ఒక మహిళా ఉద్యోగిని ఇదే కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఇప్పుడు అంతకంటే పై స్థాయిలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందినప్పటికీ ఇదే కార్యాలయంలో పనిచేస్తున్నారు. 
- 2009లో ఈ కార్యాలయానికి జూనియర్‌ అసిస్టెంట్లుగా వచ్చిన ఇద్దరిలో ఒకరికి సీనియర్‌ అసిస్టెంట్‌ రాగా, మరొకరు జూనియర్‌ అసిస్టెంట్‌గా ఇక్కడే తిష్ట వేశారు. 
డీసీ కార్యాలయమే శాశ్వత నివాసం...
బదిలీలకు నోచుకోని ఈ ఆరుగురు ఉద్యోగులు డీసీ కార్యాలయమే శాశ్వత కార్యాలయంగా మార్చేసుకున్నారు. ఏటేటా ఈ కార్యాలయంలో పలువురికి బదిలీలు జరుగుతున్నా వీరి సీటుకు మాత్రం ఢోకా ఉండటం లేదు. బదిలీల ప్రక్రియ మొదలవుతుందనగానే అధికారులకు ‘సంభావనలు’ సమర్పించుకొని బదిలీ జాబితాలో తమ పేరు లేకుండా చేసుకుంటున్నారు. డీసీగా ఎవరు వచ్చినా కార్యాలయంలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది ఆ అరడజను మంది ఉద్యోగులేనని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదోన్నతులు పొందుతున్నా సీటు మారుతారే తప్ప బయటకు పోయే ప్రసక్తే లేదు. మూడు జిల్లాలు పరిధిలో ఉన్న దేవాదాయశాఖ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఫైళ్లు,  సత్రాల భూముల లీజులు పెంపు, షాపింగ్‌ కాంప్లెక్సుల్లో దుకాణాల రెన్యూవల్స్‌ ఫైళ్లు... ఇలా ప్రతి నెలా వచ్చే 20, 30 ఫైళ్లు కార్యాలయ ఉన్నతాధికారి టేబుల్‌పైకి వెళ్లాలంటే ముందు వీరందరి చేతులు తడపాల్సిందే. ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు నిర్ణయించి దండుకోవడం ఇక్కడ రివాజుగా మారిపోయింది. వీరి నుంచే పక్కాగా ఎవరి వాటా వారికి వెళ్తుండడంతో పై అధికారులు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
ఇలా చేయొచ్చు..అయినా...
ఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ కలిగిన ఉద్యోగులను నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే బదిలీ చేయాలి. వీరిని జిల్లాలో ఉన్న ఏసీ, జెవీవో (జ్యువెలరీ వెర్ఫికేషన్‌ ఆఫీసర్‌) కార్యాలయానికి బదిలీ చేయవచ్చు. సీనియర్‌ అసిస్టెంట్లను ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాతోపాటు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్‌జేసీ) కార్యాలయం సహా జిల్లాలో పలు ప్రాంతాలకు ఇన్‌స్పెక్టర్లుగా బదిలీ చేయవచ్చు. అయినా సరే దశాబ్దాలుగా కార్యాలయానికే అతుక్కుపోయిన ఈ ఉద్యోగులను మాత్రం  కొనసాగిస్తున్న తీరు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆ కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్‌గా రాజమహేంద్రవరం అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈ ఉద్యోగుల వ్యవహారాలు మరింత మితిమీరిపోయాయంటున్నారు. ఆయన కార్యాలయానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండటంతో వీరి ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతోందని మండిపడుతున్నారు. తాజాగా బదిలీల ప్రక్రియకు తెరలేవడంతో ఈసారైనా వీరికి స్థాన చలనం ఉంటుందో లేదో  వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు