యూ‘నో’ఫాం!

17 Jun, 2016 03:57 IST|Sakshi
యూ‘నో’ఫాం!

ఇచ్చుడు వచ్చినప్పుడే..
అతీగతీ లేని యూనిఫాం క్లాత్
ఈ విద్యాసంవత్సరం  ఆలస్యమే..
సకాలంలో ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు

విద్య.. పాఠ్యపుస్తకాలు.. స్కూల్ డ్రస్.. మధ్యాహ్న భోజనం.. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సౌకర్యాలు. బడులు తెరిచే నాటికి దుస్తులు పిల్లలకు పంపిణీ చేస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి అంటూ బడిబాటలో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుల పరిస్థితి దుస్తుల జాడ లేకపోవడంతో కక్కలేక మింగలేకుండా ఉంది. యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు గత విద్యాసంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యం చేస్తారా.. అసలు దుస్తులు వస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు యూనిఫాం విషయమై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి. అధికారులు మాత్రం ఇండెంట్ పెట్టాం.. ఎప్పుడొస్తే అప్పుడే పాఠశాలలకు పంపిస్తామని చెప్పడం గమనార్హం. - ఖమ్మం

ఇండెంట్ పంపించాం..
ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఇండెంట్ పంపించాం. ఈ విద్యాసంవత్సరం 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే 1,57,364 మంది విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి క్లాత్ వచ్చిన వెంటనే యూనిఫాంలు త్వరగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. - రవికుమార్, ఎస్‌ఎస్‌ఏ పీఓ

 ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య తారతమ్య భావన లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందిస్తోంది. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల చొప్పున అందించేందుకు రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉచితంగా క్లాత్ సరఫరా చేస్తోంది. గతంలో ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తే.. ఎమ్మార్సీల ద్వారా దానిని పాఠశాలలకు పంపించడం.. అక్కడ వాటిని కుట్టించి విద్యార్థులకు సరఫరా చేసేవారు.

అయితే ఇలా చేయడం వల్ల జాప్యం జరుగుతుందని, నాణ్యత లోపిస్తుందని భావించిన ఎస్‌ఎస్‌ఏ(సర్వశిక్ష అభియాన్) అధికారులు దుస్తుల క్లాత్‌కు జతకు రూ.160, కుట్టుకూలి రూ.40 చొప్పున.. జతకు రూ.200.. రెండు జతలకు రూ.400 చొప్పున హెచ్‌ఎం అకౌంట్లలో వేసేవారు. కొన్ని ప్రాం తాల్లో ఇవి సక్రమంగా పంపిణీ కావడం లేదని, పలువురు డబ్బులు కాజేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో క్లాత్‌ను నేరుగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కుట్టించి ఇచ్చేవారు. అయితే గత విద్యాసంవత్సరం ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. పంద్రాగస్టుకు కొత్త బట్టలు వేసుకుందామని భావించిన విద్యార్థులకు.. జవవరి 26 వరకు కూడా అందుబాటులోకి రాలేదనే విమర్శలు వచ్చాయి.

 ఈ‘సారీ’ ఆలస్యమే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నానా తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు దుస్తులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. దుస్తులు ఎక్కడ కొనుగోలు చేయాలి.. ఎవరికి అప్పగించాలి.. అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా దుస్తుల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అన్నీ ఉచితమే అని ఉపాధ్యాయులు చెప్పడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నామని, అయితే దుస్తులు ఇవ్వడం ఆలస్యం కావడంతో కొత్త బట్టలు కుట్టించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు వందలకు వందలు పెట్టి బట్టలు ఎలా కుట్టించాలని వాపోతున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి సరఫరా చేస్తే ఈ బాధ ఉండేది కాదని అంటున్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, దుస్తులు అందిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు