త్యాగానికి విలువేదీ...

7 Jul, 2013 04:09 IST|Sakshi

ఆరేళ్లుగా కాలయాపన  
 ప్రారంభం కాని పునరావాస పనులు
 వారి త్యాగం వెలకట్టలేనిది.
 లక్షల మంది ప్రజల ప్రయోజనాల కోసం పచ్చని ప్రకృతి ఒడిలో తాత, ముత్తాతల నుంచి పుట్టి
 పెరిగిన ఊరును, మానసికంగా
 పెనవేసుకున్న అనుబంధాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బంగారం పండే పొలాలనూ
 వదులుకుంటున్నారు. కానీ వారిపట్ల సానుభూతిగా
 వ్యవహరించాల్సిన ప్రభుత్వం
 నిర్లక్ష్యం వహిస్తోంది.
 పునరావాసం కల్పించడంలో
 తీవ్ర  జాప్యం చేస్తోంది.
 మార్కాపురం, న్యూస్‌లైన్: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొట్టిపడియ డ్యామ్ కింద ముంపు గ్రామమైన గొట్టిపడియ నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆరేళ్ల నుంచి నిర్వాసితులకు ఇళ్ల స్థలాల సేకరణ పూర్తికాలేదు. గొట్టిపడియ గ్రామంలో సుమారు 900 కుటుంబాలు, 600 గృహాలున్నాయి. వీరిలో 60 కుటుంబాల వారికి నేటికీ నష్టపరిహారం అందలేదు. 20 ఎకరాలకు సంబంధించిన పది మంది రైతులకు నష్టపరిహారం పంపిణీ చేయలేదు.  డ్యామ్ పరిధిలో గొట్టిపడియ, అక్కచెరువు తండాలు మునిగిపోనున్నాయి.
 
  వీరికి మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న  అల్లూరిపోలేరమ్మ దేవాలయం వద్ద 60 ఎకరాల్లో కొంత మందికి, కోమటికుంట వద్ద 45 ఎకరాల్లో మరి కొంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, భూములు కోల్పోతున్న రైతులు కోర్టుకు వెళ్లటంతో ఆరేళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదు. గొట్టిపడియ ప్రధాన కాలువ పూర్తయి నాలుగేళ్లు కావొస్తోంది.
 
 కొంత మందికి ఇంకా నష్టపరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యూనిట్ 3 పరిధిలోకి వచ్చే గ్రామ ప్రజలకు ఆర్‌ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అధికారులు అమలు చేయడం లేదు. ఇదిలా ఉండగా, గొట్టిపడియ లింక్ కాలువ నిర్మాణంలో కూడా 15 ఎకరాలకు సంబంధించిన  రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో అటు భూమినీ కోల్పోయి, ఇటు నష్టపరిహారం రాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీనితో పాటు కాలువకు ఆవల వైపున కూడా సుమారు 20 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని బాధిత రైతులు తెలిపారు.
 
 విచారణ చేపడతాం
 గ్లోరియా, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్
 గ్రామంలో కొంత మందికి నష్టపరిహారం రాని మాట వాస్తవమే. పరిహారం కోసం వారు అర్జీలు ఇచ్చారు. గ్రామానికి వెళ్లి విచారణ చేసి అర్హులైన వారికి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం.
 
 పరిహారం చెల్లించలేదు
 నడికట్టు నారాయణ, గొట్టిపడియ
 మా ముత్తాత తరం నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం. అన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే, నా ఇంటికి, మూడున్నర ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించలేదు. ఇదేమని అడిగితే ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. అటు పొలం లేక ఇటు కూలీ పనులు లేక జీవనాధారం కష్టమైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాకు నష్టపరిహారం ఇవ్వాలి.
 
 పొలానికి, ఇంటికి పరిహారం రాలేదు
 ఈశ్వరమ్మ
 ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణంలో అధికారులు మా భూమిని సేకరించి మాకు మాత్రం పరిహారం చెల్లించలేదు. మా ఇంటికి, మూడున్నర ఎకరాల పొలానికి పరిహారం ఇవ్వాలని కోరితే అదిగో, ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు