భోజనం మాది.. నీళ్లు మీవి!

6 Jul, 2016 02:47 IST|Sakshi
భోజనం మాది.. నీళ్లు మీవి!

జిల్లాలోని అనేక పాఠశాలల్లో నీటి వసతి కరువు
అతిథి గృహాల్లోనూ అవే ఇబ్బందులు
బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు
అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

కార్పొరేట్ స్థాయి విద్య.. సకల సౌకర్యాలు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించండి... ఇదీ ప్రతిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలు. కానీ, వాస్తవ  పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రభుత్వ విద్యాలయాల్లో కనీసం తాగునీరు కూడా అందని దుస్థితి. ఇక టాయిలెట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో బడుల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు అనాసక్తి చూపుతున్నారు.

రాయికోడ్ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు తెచ్చుకునే బాటిళ్లలో నీళ్లు అయిపోతే.. ఇక వారు పడే బాధ చెప్పలేనిది. మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు శంశోద్ధీన్‌పూర్, ఇటికేపల్లి ప్రాథమికోన్నత, అల్లాపూర్ ప్రాథమిక, మహబత్‌పూర్, పాంపాడ్, దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. పలు పాఠశాలల్లో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. మరికొన్ని మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తామన్న అధికారుల మాటలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా కనీస సౌకర్యాలు సమకూరకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. మండలంలో 25 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సగం పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది.

రెండేళ్లుగా ఇంటి నుంచే నీళ్లు
రెండు సంవత్సరాలుగా ఇంటి నుంచే బాటిల్‌తో నీళ్లు తెచ్చుకుంటున్నా. మధ్యాహ్న భోజనంలో వీటినే ఉపయోగిస్తున్నా. పాఠశాలలో నల్లా ఉన్నా నీళ్లు రావడం లేదు. -సోని, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల.

ఇబ్బందిగా ఉంది
పాఠశాలలో నీళ్లు రావడం లేదు. బాటిళ్లలో తెచ్చుకున్న నీళ్లు అయిపోతే హోటళ్లు, బావుల వద్దకు వెళ్తున్నాం. ప్రతిరోజు నల్లాల ద్వారా నీళ్లు అందించాలి.  - అర్జున్, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల

ఉన్నతాధికారులకు చెప్పాం
మండలంలోని కొన్ని పాఠశాలల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. నీటి సౌకర్యం లేని పాఠశాలల వివరాలు, విద్యార్థుల ఇబ్బందులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. - నగారి శ్రీనివాస్, ఎంఈఓ రాయికోడ్.

మరిన్ని వార్తలు