ఎన్ని అవకాశాలో.. అన్ని సవాళ్లు

5 Jan, 2017 03:13 IST|Sakshi
ఎన్ని అవకాశాలో.. అన్ని సవాళ్లు

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థపై నోబెల్‌ బహుమతి గ్రహీత జీన్ టిరోలే
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ద్వారా సమాజాభివృద్ధికి ఎన్ని అవకాశాలు లభిస్తాయో.. అదే స్థాయిలో సవాళ్లూ ఎదురుకానున్నాయని ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి గ్రహీత జీన్ టిరోలే స్పష్టం చేశారు. 21వ శతాబ్దం విజ్ఞాన ఆధారిత సమాజమన్న విషయంలో సందేహాలు లేకపోయినప్పటికీ వ్యాపార, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించకుండా సత్ఫలితాలను ఆశించలేమన్నారు. సమస్యలను ముందుగానే అంచనా చేసి పరిష్కార మార్గాలను ఆన్వేషించాలని ఆర్థికవేత్తలకు సూచించారు. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో టిరోలే బుధవారం ఉపన్యసించారు.

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విస్తృతమవుతున్న కొద్దీ సంప్రదాయ ఉద్యోగాలు తగ్గిపోతాయని, వేతన జీవుల సంఖ్య వేగంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఉబర్‌ లాంటి క్యాబ్‌ కంపెనీలు ప్రస్తుతం ట్యాక్సీడ్రైవర్లకు అవకాశాలు కల్పిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఐదు, పదేళ్లలో అందుబాటులోకి రానున్న డ్రైవర్‌ రహిత వాహనాల ధాటికి ఇవి కూడా కనుమరుగవుతాయన్నారు. అయితే కొన్ని రకాల ఉద్యోగాలు పోతే మరికొన్ని కొత్త తరహా ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడటం ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో ముఖ్యాంశమని చెప్పారు. సామాజిక అసమానతలు పెరిగిపోవడం మధ్యతరగతి వర్గం కనుమరుగు కావడం కూడా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ద్వారా వచ్చే దుష్పరిణామాల్లో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు