విభిన్న విధానాల వల్లే విజయం

5 Jan, 2017 02:56 IST|Sakshi
విభిన్న విధానాల వల్లే విజయం

► బంగ్లాదేశ్‌ గ్రామీణ్‌ బ్యాంక్‌ విజయంపై నోబెల్‌ అవార్డు గ్రహీత మహ్మద్‌ యూనస్‌
►పేదలకు రుణాలివ్వాలని అందర్నీ కోరి భంగపడ్డా
►అందుకే పేదలే యజమానులుగా గ్రామీణ్‌ బ్యాంక్‌ పెట్టాను


తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్థల నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేయడమే బంగ్లాదేశ్‌లో గ్రామీణ్‌ బ్యాంక్‌ విజయానికి ప్రధాన కారణమని నోబెల్‌ అవార్డు గ్రహీత మమహ్మద్‌ యూనస్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన జాతీయ సైన్స్  కాంగ్రెస్‌లో మాట్లాడుతూ.. గ్రామీణ్‌ బ్యాంక్‌ మొదలుకాక ముందు పేదలకు రుణాలివ్వాల్సిందిగా ప్రతి బ్యాంక్‌ను కోరి భంగపడ్డానని చెప్పారు. దీంతో 1983లో పేదల కోసం.. వారే యజమానులుగా బ్యాంక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ్‌ బ్యాంక్‌ బంగ్లాదేశ్‌లోని ప్రతి గ్రామం, పట్టణంలో శాఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు.

200 కోట్ల డాలర్లకుపైగా నిధులు రుణాలుగా ఇస్తే పేద మహిళల నుంచి అంతకుమించిన డిపాజిట్లు చిన్నచిన్న మొత్తాల రూపంలో జమ అయ్యాయని ఆయన వివరించారు. గ్రామీణ్‌ బ్యాంక్‌ ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే పేదలకు రుణాలిస్తున్నామని, 40 ఏళ్లుగా రుణ వసూళ్లు దాదాపు వంద శాతం ఉండటం గమనార్హమని యూనస్‌ అన్నారు. ఇంతటితో ఆగకుండా పిల్లలను పాఠశాలకు పంపించేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించామని, తద్వారా వారు ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులుగా మారారని వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లో..

►  కొన్నేళ్ల క్రితం అనేక మంది యువతీ యువకులు నా వద్దకు వచ్చి పెద్ద చదువులు చదివినా తమకు ఉద్యోగాలు రావడం లేదని ఫిర్యాదు చేసేవారు. గ్రామీణ్‌ బ్యాంక్‌ యజమానులైన మీ తల్లుల నుంచి పాఠాలు నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని వారికి సూచించాను. ఈ రకంగా పుట్టుకొచ్చిందే సోషల్‌ బిజినెస్‌. ఈ విధంగా  గ్రామీణ్‌ బ్యాంక్‌ ఓ వెంచర్‌ క్యాపటలిస్ట్‌గానూ మారింది. ఆసక్తికరమైన ఆలోచనలు, వ్యాపార నమూనాతో ముందుకొచ్చే యువకులకు ఎలాంటి హామీలు లేకుండా నిధులు అందజేశాం. వారి వ్యాపారాలు విజయవంతమయ్యేందుకు దగ్గరుండి మా వంతు సహకారం అందించాం. వారు వ్యాపారంలో నిలదొక్కుకున్న తరువాత మా పెట్టుబడి మాకు తిరిగివచ్చాయి. దాతృత్వం ద్వారా ఇది సాధ్యం కాదు.

►  సోషల్‌ బిజినెస్‌కు ఇంకో ఉదాహరణ గ్రామీణ్‌ బ్యాంక్‌ అంతర్జాతీయ డెయిరీ కంపెనీ డానోన్ తో కలిసి స్థాపించిన సంస్థ. బంగ్లాదేశ్‌ పిల్లల్లోని పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఈ సంస్థ ప్రత్యేకమైన పెరుగును తయారు చేస్తోంది. పోషకాలన్నీ ఉండే ఈ పెరుగు రకరకాల రుచుల్లో లభిస్తోంది. డానోన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇది తక్కువ ధరకే లభిస్తుండటంతో అటు పోషికాహార లోపమనే సామాజిక సమస్యకూ పరిష్కారాన్ని చూపగలిగాం

► 2050 నాటికల్లా 3 అంశాలను జీరోకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. పేదరికం, నిరుద్యోగం, కర్బన ఉద్గారాల కట్టడి.. ఈ మూడు అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను.

కాదేదీ వ్యాపారానికి అనర్హం
ఫ్రాన్స్ లో మెకెయిన్  అని ఓ కంపెనీ ఉంది. బంగాళాదుంపలతో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ చేయడం దీని వ్యాపారం. ఈ సంస్థ కూడా ఇటీవల సోషల్‌ బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టింది.ఫ్రాన్స్ లో పండించే ఆకారం బాగా లేదని పెద్ద కంపెనీలు పక్కన పడేసే ఆలుగడ్డలను సేకరించి వాటితో సూప్‌లు చేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి బంగాళాదుంపలతో పాటు అన్ని రకాల కాయగూరలతోనూ ఇదే తరహా వ్యాపారం చేయడం మొదలుపెట్టింది.

మరిన్ని వార్తలు