టీడీపీలో నామినేటెడ్‌ చిచ్చు

2 Oct, 2016 18:28 IST|Sakshi
* పదవుల కేటాయింపులో సీనియర్లకు దక్కని చోటు
మాజీ మంత్రి పుష్పరాజ్‌కు మరోసారి మొండిచేయి
కాంగ్రెస్‌ నుంచి వచ్చిన డొక్కా, హిదాయత్‌లకు చైర్మన్‌ పోస్టులు
టీడీపీ అధిష్టానం, జిల్లా మంత్రులపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు
 
సాక్షి, గుంటూరు: జిల్లా టీడీపీలో నామినేటెడ్‌ పదవుల కేటాయింపుతో చిచ్చు రేగింది. ఎప్పటినుంచో టీడీపీని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్‌ నాయకులను విస్మరించి కొత్తగా పార్టీలోకి చేరినవారికి పదవులు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన తరువాత నామినేటెడ్‌ పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన ఎం.డి.హిదాయత్, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లకు చైర్మన్‌ పోస్టులు కట్టబెట్టడంపై పార్టీ సీనియర్‌ నాయకులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా పదవులు అనుభవించి.. టీడీపీపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అప్పటి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు పదవి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ పదేళ్లు అధికారంలో లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ కష్టపడి పనిచేసిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌కు మాత్రం మొండిచెయ్యి చూపారంటూ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇలా అనేక పదవులు కేటాయించే సమయంలో పుష్పరాజ్‌ పేరును తెరపైకి తేవడం, చివరి నిమిషంలో పక్కనపెట్టడం పరిపాటిగా మారిందని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గతంలో పలు సంఘాలు సమావేశాలు పెట్టి పుష్పరాజ్‌కు పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు  చేసిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే సీనియర్‌ నేతల ఎదురుచూపులు...
పార్టీలో మొదటి నుంచి పనిచేసిన మాజీ మంత్రులు పుష్పరాజ్, శనక్కాయల అరుణలతో పాటు జియావుద్దీన్, దాసరి రాజా మాస్టారు, చందు సాంబశివరావు, వెన్నా సాంబశివారెడ్డి, ఇలా చెప్పుకొంటూపోతే అనేకమంది సీనియర్‌ టీడీపీ నేతలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. వారిని కనీస పరిగణనలోకి తీసుకోని పార్టీ అధిష్టానం, జిల్లా మంత్రులు... ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, తమకు తొత్తులుగా వ్యవహరించే అనుయాయులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా పదుల సంఖ్యలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఎటువంటి మేలూ జరగలేదనే అసంతృప్తి ఉంది. ఎన్నికల సమయంలో మాత్రం తమ చుట్టూ తిరిగి పనిచేయించుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల విషయానికొచ్చేసరికి కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
పదవులు అమ్ముకున్నారంటూ ఆరోపణలు...
ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో సైతం టీడీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగితే పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినా దాన్ని పెడచెవిన పెట్టేశారు. ఇటీవల ప్రకటించిన గుంటూరు మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ పోస్టుల్లో సైతం పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేసేవారిని పక్కన పెట్టి పైరవీకారులకు పదవులు కట్టబెట్టి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిదులు నామినేటెడ్‌ పదవులను అమ్ముకుంటున్నారంటూ పార్టీలోని సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు గుప్పించడం చూస్తుంటే టీడీపీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
కార్పొరేషన్‌ ఎన్నికలపై ఎఫెక్ట్‌...
త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీలో రేగిన పదవుల కుంపటి ఏ అనర్థాన్ని తెచ్చి పెడుతుందోనని టీడీపీ కార్యకర్తలు మధనపడుతున్నారు. ఇలాగైతే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి తప్పదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 
 
మిత్రధర్మాన్ని మరిచారంటూ బీజేపీ విమర్శలు...
గుంటూరు మార్కెట్‌ యార్డు పాలకవర్గంలో తమకు రెండు డైరెక్టర్ల పోస్టులు ఇస్తామంటూ మాట ఇచ్చి చివరి నిమిషంలో ఇవ్వకుండా టీడీపీ నేతలు మిత్ర ధర్మాన్ని మరిచారంటూ బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. దీంతో మిత్రపక్షమైన బీజేపీ నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంకేతాలు రావడంతో కార్పొరేషన్‌ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని, టీడీపీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు