పరిశీలన ముగిసింది

15 Jul, 2013 17:10 IST|Sakshi


   బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు సాగిన నామినేషన్ల పర్వంలో ఎన్నికలు జరుగుతున్న 962 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 5655, 10,742 వార్డులకు 30,241 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం జరిగిన పరిశీలనలో పెద్దాపురం డివిజన్ మినహా జిల్లా వ్యాప్తంగా 252 సర్పంచ్ నామినేషన్లు, 1090 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అమలాపురం డివిజన్‌లో 154 సర్పంచ్, 508 వార్డులు, కాకినాడ డివిజన్‌లో 28 సర్పంచ్, 107 వార్డులు, రాజమండ్రి డివిజన్‌లో 67 సర్పంచ్, 197 వార్డులు, రంపచోడవరంలో 3 సర్పంచ్, 278 వార్డులకు దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కొన్ని గ్రామాల్లో అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకట్ట వేయగలిగారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా పలు పంచాయతీల్లో 21 ఏళ్లు నిండని వారు నామినేషన్లు దాఖలు

చేయడంతో వాటిని తిరస్కరించారు. పెద్దాపురం డివిజన్ సమాచారం అందాల్సి ఉంది. పలు నామినేషన్లలో ప్రతిపాదిత సంతకాలు లేకపోవడంతో భారీగా వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఉదాహరణకు తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీలో సర్పంచ్ పదవికి ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేయగా ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో కాంగ్రెస్, టీడీపీలు బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లు ఉన్నాయి. కోరంగి లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి పులగుర్తి శిరీష కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నామినేషన్ వేయగా, స్థానికంగా ఓటు హక్కు లేకపోవడంతో ఈ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో కాంగ్రెస్ మద్దతుదారు చిట్టూరి శీలగౌరి దాఖలు చేసిన నామినేషన్ అనుబంధ పత్రాల్లో ఆమె సంతకాలు లేవు. ఇది గుర్తించిన రిటర్నింగ్ అధికారి పరిశీలన సమయంలో ఆమెతో సంతకం చేయించేందుకు ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు.

దీంతో చేసేది లేక శీలగౌరి నామినేషన్‌ను తిరస్కరించారు. పిఠాపురం మండలం విరవాడ, కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా పూర్తిచేయకపోవడంతో వాటిని తిరస్కరించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో 21 ఏళ్లు నిండని అభ్యర్థులు ఐదు వార్డుల పరిధిలో దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. జిల్లాలో పలుచోట్ల ఇలా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాగా వీటిపై డివిజన్ స్థాయి ఎన్నికల అధికారి ఆర్డీఓ వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కాగా 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించి వారికి గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్ల పరిశీలనలో గట్టెక్కిన అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో తమ అవకాశాలను బేరీజు వేసుకుంటూ ప్రచారం వైపు దృష్టి సారించారు.

నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు : తొలి సారిగా నిర్వహిస్తున్న వెబ్ కాస్టింగ్‌కు సుమారు రూ. 70 లక్షలు వ్యయం చేయనున్నారు. నిఘా నీడన ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు 320, అత్యంత సమస్యాత్మక గ్రామాలు 283 ఉండగా, వీటి పరిధిలో ఆరువేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వెబ్‌కాస్టింగ్, మెక్రో అబ్జర్వర్లు, వీడియో గ్రాఫర్ల సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో చాలాచోట్ల కరెంటు, నెట్ సదుపాయం పూర్తి స్థాయిలో లేకపోవడంతో 1208 కేంద్రాల్లో మాత్రమే వెబ్ కాస్టింగ్ సాధ్యమని తేల్చారు. 970 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, 500 కేంద్రాల్లో వీడియో గ్రాఫర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.
 

మరిన్ని వార్తలు