మధ్యాహ్నం’ కలేనా?

4 Jul, 2017 05:41 IST|Sakshi
మధ్యాహ్నం’ కలేనా?

కళాశాలల్లో అమలుకు నోచుకోని భోజన పథకం
అవస్థలు పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని ప్రభుత్వం

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధికంగా చదివేది గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులే. వీరు ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి ఆయా కళాశాలలకు జిల్లా కేంద్రానికి వస్తారు. వీరంతా చదువును మధ్యలో మానేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటుకు గతేడాది నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికి ఆ పథకం గురించి ప్రభుత్వం ఊసేత్తకపోవడంతో మధ్యాహ్న కలనే మిగిలిపోయేట్లు కనిపిస్తోంది. ఇదివరకు ప్రతి కళాశాలలో ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం సమగ్ర నివేదికను ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకున్నారు. ఒక విద్యార్థికి రూ. 14లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రారంభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్‌ కళాశాలల్లో అధికంగా పేద విద్యార్థులే చదువుతున్నారు.

నియోజక వర్గంలో..
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 800 మంది వరకు ఉంటారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో దాదాపు వెయ్యి మంది వరకు, బేలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరిందరికి భోజనం అందించేందుకు ఇదివరకే అధికారులు ఇదివరకే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించినప్పటికి నేటికి సాకారం కాలేదు. దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న కొంత విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక మధ్యాహ్నం వరకు తరగతులకు హాజరై ఇంటి ముఖం పడుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఇంటి టిఫిన్‌ బాక్సులు తీసుకువచ్చి కళాశాలలో భోజనం చేస్తున్నారు.

ఈ సారైనా అమలయ్యేనా
ఈ విద్యా సంవత్సరమైన ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు విద్యాశాఖ మంత్రి.. కళాశాలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, దీని ఊసెత్తడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. బడ్జెట్‌ కొరత వల్లే పునరాలోచనలో పడినట్లు ప్రచారం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పథకం అమలు చేయడం వల్ల హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు లెక్చరర్లు పేర్కొంటున్నారు.

ఉదయం తినకుండానే..
ఉదయం ఇంటి నుంచి తినకుండానే కళాశాలకు వస్తున్నాం. ఒక్కోసారి ఇంట్లో వంట కాకపోతే పస్తులు ఉండాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
– సౌందర్య, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల

మరిన్ని వార్తలు