చేతిరాత పాస్‌పోర్టులిక చెల్లవు

16 Sep, 2016 19:37 IST|Sakshi

మర్రిపాలెం (విశాఖపట్నం) : చేతి రాతతో కూడిన పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నాన్ మెషీన్ రీడబుల్ పాస్‌పోర్ట్(ఎంఆర్‌పీ) కలిగినవారంతా మళ్లీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్నేషల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) నిబంధనల ప్రకారం చేతిరాత పాస్‌పోర్ట్‌లను నిషేధించారు. ఈ నిబంధన 2015 నవంబర్ 24 నుంచి అమలులో ఉంది. మన దేశంలో దాదాపు 2.5 ల క్షల మంది చేతిరాత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

పాస్‌పోర్టులో చేతిరాత, ఫొటోగ్రాఫ్ మాన్యువల్‌గా అతికించి ఉన్నవారు నాన్ మెషిన్ రీడబుల్ కేటగిరిలోకి వస్తారని విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. చేతిరాత పాస్‌పోర్ట్‌తో రాకపోకలు చేస్తే అడ్డంకులు తప్పవని హెచ్చరించారు. దేశంలోని, ఇతర దేశాలలోని వారంతా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. చేతి రాత పాస్‌పోర్ట్‌లున్నవారు వాటిని తమ కార్యాలయంలో సమర్పించి మెషిన్ రీడబుల్ పాస్‌పోర్ట్‌లు పొందాలని సూచించారు. www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని తెలిపారు. 1800-258-1800 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు