ఈ ఏడాదైనా మోక్షమొచ్చేనా?

30 Jul, 2016 23:44 IST|Sakshi
ఈ ఏడాదైనా మోక్షమొచ్చేనా?
– కస్తూర్బాల్లో భర్తీకి నోచుకోని ఖాళీలు
– 40 టీచింగ్, 35 నాన్‌టీచింగ్‌ పోస్టులు ఖాళీ
– భర్తీ చేయాలని ప్రభుత్వానికి అధికారుల నివేదిక
– గతేడాది అనుమతించని కలెక్టర్‌ 
 
 
కస్తూర్బాల్లో ఖాళీల భర్తీకి గ్రహణం పట్టింది. గతేడాది భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉన్నా జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అనుమతించలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఈ క్రమంలో పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది. 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  
కారణాలేవైనా మధ్యలో బడి మానేసిన బాలికలు తిరిగి చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. అన్ని మండలాల్లో ఒక్కో పాఠశాల ప్రకారం జిల్లాలో 54 పాఠశాలలు ఏర్పాటయ్యాయి.  అక్కడ పనిచేసే టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ప్రతి పాఠశాలలకు స్పెషలాఫీసర్‌ పోస్టుతోపాటు టీచింగ్‌ కోసం క్లస్టర్‌ రిసోర్స్‌ టీచర్లు ఉంటారు. వీరిని ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 2014–15 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఆయా పోస్టులు రెగ్యులర్‌ కాకపోవడం, ఇక్కడ పనిచేసేవాళ్లకు ఇతర అవకాశాలు రావడంతో వెళ్లిపోవడం కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయి. 
రెండేళ్లుగా భర్తీకి నోచుకోని పోస్టులు.. 
జిల్లాకు సంబంధించి 54 కస్తూర్బా పాఠశాలల్లో 40 టీచింగ్, 35 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్‌ విభాగంలో పాఠశాలకు అతిముఖ్యమైన స్పెషల్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా నాలుగు పాఠశాలల్లో ఖాళీగా ఉండడం గమనార్హం. దీంతో వాటి బాధ్యతలను పక్క మండలాల పాఠశాలల ఎస్‌ఓలకు అప్పగించారు. అంతేకాక వివిధ సబ్జెక్టుల బోధన చేసే 36 సీఆర్‌టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్, స్వీపర్, వాచ్‌మన్‌ తదితర పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. 2015–16 విద్యా సంవత్సరంలో భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ నిరాకరించారు. దీంతో ఆ ఏడాది మొత్తం పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఈ ఏడాది అంటే 2016–17 విద్యాసంవత్సరంలో భర్తీ కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే పాఠశాలలు పునః ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా పోస్టుల భర్తీ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
ప్రభుత్వానికి నివేదిక పంపాం: వై.రామచంద్రారెడ్డి, పీఓ
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లోని ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. 40 టీచింగ్, 35 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే పరీక్ష నిర్వహించి పోస్టులను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
 
మరిన్ని వార్తలు