అత్యవసరం.. అందనంత దూరం

21 Jul, 2016 01:08 IST|Sakshi
బిట్రగుంట : ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను తీవ్రంగా వేధిస్తుంది. పాఠశాలల్లో ప్రతి సంవత్సరం రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నా నీటి వసతి కల్పించకపోవడం, నిర్వహణాలోపం కారణంగా అవి వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులతో పాటు బోధనా సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోజులో ఎనిమిది గంటలకుపైగా పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు, విద్యార్థులు మరుగుదొడ్లు లేని కారణంగా చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్నారు. మండల పరిధిలో 41 ప్రాథమిక, ఎనిమిది ప్రాథమికోన్నత, ఐదు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా మూడు వేల మందికి పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేని కారణంగా వినియోగానికి నోచుకోవడం లేదు. 19 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నిర్వహణాలోపం కారణంగా పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ప్రతీఏటా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుండటంతో ఒక్కో పాఠశాలలో రెండు, మూడు వంతున కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే ఒక్క పాఠశాలలో కూడా నీటి వసతి లేకపోవడంతో ఒక్క మరుగుదొడ్డి కూడా వినియోగంలోకి రావడం లేదు. మరుగుదొడ్ల సమస్యపై విద్యాశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
 
చైతన్యమేదీ.. 
నిర్మల్‌భారత్‌ అభియాన్, స్వచ్ఛభారత్‌ పథకాల పేరుతో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తతంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారులు ఏకంగా రాత్రిబస చేసి మరీ మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. అయితే పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యపై మాత్రం ఒక్క అధికారి కూడా దష్టి సారించకపోవడం గమనార్హం. ఏపాఠశాలకు వెళ్లినా పాఠశాల చుట్టూ బహిరంగ మలవిసర్జనతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన కారణంగా ముందుగా వ్యాధులబారిన పడేది కూడా చిన్నారులే. ఈవిషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంపై మండల విద్యాశాఖాదికారి జయంత్‌బాబును సంప్రదించగా మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
 
మరిన్ని వార్తలు