పల్లెల్లో అధ్వానంగా రోడ్లు

20 Jul, 2016 23:24 IST|Sakshi
పల్లెల్లో అధ్వానంగా రోడ్లు
 
 
సంగం : మండలంలోని కోలగట్ల, తిరుమనతిప్ప, పెరమన, దువ్వూరు, పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా దళితవాడల్లో రోడ్లు దెబ్బతిని బురదమయమై ఉన్నాయి. దళితులు బురద రోడ్ల మీదనే నడుస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దష్టి పెట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయి. ఈ రోడ్లపై గ్రామీణ ప్రాంత ప్రజలు తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు సైతం అంతర్గత రోడ్లు దెబ్బతినడంతో పొలాలకు రసాయనిక ఎరువులు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. 
  జెండాదిబ్బ, అనసూయనగర్, దువ్వూరు, అరవపాళెం, పడమటిపాళెం గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. పొలంలో నుంచి ప్రతినిత్యం పంటను నెల్లూరు మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుంది. రోడ్లు దెబ్బతిని బండ్లు నడవలేకపోవడంతో ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తుందని సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎద్దల బండ్లపై పంటను తీసుకెళ్తే ఖర్చు తక్కువ.  ట్రాక్టర్లపై తీసుకెళ్తే తడిసిమోపెడవుతోంది. రోడ్లు సరిగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి ట్రాక్టర్ల ద్వారా పంటను తరలిస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని పలువురు సర్పంచులు అధికారుల దష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు అర్జీలు సైతం సమర్పించారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో ఛిద్రమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రజలు, సన్నకారు రైతులు కోరుతున్నారు.
 
నివేదికలు పంపాం : మల్లికార్జున, పంచాయతీరాజ్‌ ఏఈ
మండలంలో పలు గ్రామాల్లో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని మరమ్మతులు చేసేందుకు నివేదికలు పంపాం. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.
 
>
మరిన్ని వార్తలు