గత వినతులకే గతిలేదు..!

2 Jan, 2017 22:34 IST|Sakshi
గత వినతులకే గతిలేదు..!

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మూడు పర్యాయాలు ‘జన్మభూమి–మా ఊరు’  కార్యక్రమాలు నిర్వహించింది. లక్షల మంది రేషన్‌ కార్డులు, ఇళ్లు, పింఛన్లు, మరుగుదొడ్లు, గ్రామీణ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు అందజేశారు. వీటిని పరిష్కరించకుండానే సోమవారం నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి సభల నిర్వహణకు సిద్ధం కావడంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప తెలుగుదేశం పాలనలో ఒక్కసంక్షేమ పథకమూ సరిగా అందడం లేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం సాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా... నగదు కష్టాలు పరిష్కరించకుండా, పింఛన్లు సరిగా పంపిణీ చేయకుండా మళ్లీ జన్మభూమి కమిటీలు ఎందుకంటూ ధ్వజమెత్తుతున్నారు. గతంలో వచ్చిన 1,41,053 వినతుల్లో ఎన్ని సరిగా పరిష్కరించారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. విధిలేక మరోసారి వ్యయప్రయాసల కోర్చి వినతులు, ఫిర్యాదులు అందజేసేందుకు, అధికారుల ముందు గోడు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో ఇలా...
తొలివిడత జన్మభూమి కార్యక్రమం 2014 అక్టోబర్‌ 2 నుంచి 20 తేదీ వరకు జరిగింది. తొలిసారి కావడంతో ప్రజలు స్పం దించి  జిల్లా వ్యప్తంగా 34 శాఖలకు సంబంధించిన 1,74,153 వినతులు అందజేశారు.  వీటిలో ప్రధానంగా  రెవెన్యూ–44,314, సివిల్‌ సప్‌లై (కొత్తకార్డు కోసం)–36,557, గృహనిర్మాణం–44,313,  పంచాయతీ రాజ్‌ విభాగానికి 11,780, పింఛన్లు కోసం–12,502, తాగునీటి సమస్యలపై–2,190 ఇలా అన్ని శాఖలకు సంబంధించిన  వినతులు వచ్చాయి. వీటిలో అధిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో  2015 జూన్‌ 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన జన్మభూమిలో కేవలం 6,155 సమస్యలే వచ్చాయి. 2016 జనవరి 2 నుంచి 11 వరకు జరిగిన జన్మభూమి సభల్లో కేవలం జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే రేషన్‌ కార్డులు అందజేశారు.అన్ని శాఖలకు సంబంధించి 60,745, వినతులు వచ్చినా పరిష్కారం అంతంత మాత్రమే.

నేటి నుంచి నాలుగో విడత జన్మభూమి సభలు
జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ సారి  15 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. కుటుంబ వికాసం.. సమాజ వికా సం, సమగ్ర రాష్ట్ర వికాసం.. సంపూర్ణ దేశ వికాసం ధ్యేయంగా జీవన భద్రత ఎన్టీఆర్‌ భరోసా, ఆహార భద్రత, చంద్రన్న బీమా, విద్యుత్‌ భద్రత, దీపం పథకం, ఆత్మ గౌరవం, ఆరోగ్య భద్రత, విద్యాభద్రత, మంచినీటి భద్రత, గృహ భద్రత, ఇంటింటా పశుసంపద, ఉపాధి ఉద్యోగ భద్రత, సమాచార సాంకేతిక విజ్ఞానం, శాంతిభద్రతల పరిరక్షణ/మహిళలకు భద్రత, ప్రతి కుటుంబానికి రూ.10 వేలు కనీస ఆదాయం  వచ్చేలా చర్యలు తీసుకొవాలంటూ ప్రణాళికలు సిద్ధం చేశారు. పింఛన్లు, ఇళ్లు మంజూరు, రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీపం కనెక్లన్లు, సంక్రాంతి కానుకలను జన్మభూమి సభల్లోనే పంపిణీ చేయాలని తీర్మానించారు. అయితే... ప్రణాళికలు  కార్యరూపం దాల్చేనా అన్న అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.  

విద్యుత్‌ ఫిర్యాదుల స్వీకరణ
జిల్లా వ్యాప్తంగా జరిగే జన్మభూమి–మా ఊరు గ్రామ సభల్లో విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్‌ ఇంజినీరు దత్తు సత్యనారాయణ తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న జన్మభూమి–మాఊరు గ్రామ సభలకు విద్యుత్‌ సిబ్బంది హాజరవుతారని, తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.  వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

>
మరిన్ని వార్తలు