అంగన్‌వాడీ కేంద్రాల్లో దిక్కులేని మధ్యాహ్న భోజనం

2 Jul, 2013 03:42 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: ‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుంది ప్రభుత్వం తీరు. వంటకు నిత్యావసర సరుకులు, సామగ్రి ఇవ్వకుండానే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకాన్ని చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఈ పథకం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. అమృతహస్తం పథకం అమలయ్యే మండలాల్లోని కొన్ని కేంద్రాల్లో తప్ప మిగిలిన ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనూ చిన్నారులకు వంట చేయలేదు. చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలన్న ఉద్దేశం మంచిదే అయినా, ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. జిల్లాలో 3,664 అంగన్‌వాడీ, 162 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
 వాటిలో మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 79,399 మంది నమోదయ్యారు. వీరిలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. అత్యధిక పోషక విలువలు గల ఆహారాన్ని మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించింది. వీరికి నిత్యం 75 గ్రాముల అన్నం, 15 గ్రాముల పప్పు, 25 గ్రాముల కూరగాయలు/ఆకుకూరలు, 5 గ్రాముల నూనె, వారానికి రెండుసార్లు ఉడకబెట్టిన గుడ్డు అందజేయాలి.
 నెలరోజులుగా ప్రచారమే..
 ప్రభుత్వం అంగన్‌వాడీల్లో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని నెల రోజులుగా ఊదరగొట్టింది తప్ప పథకం అమలు కాసింతైనా మనసు పెట్టలేదు. ఇప్పటివరకు అవసరమైన బియ్యం, నూనె, పప్పు, ప్లేట్లు, గ్లాసులను అంగన్‌వాడీ కేంద్రాలకు చేర్చలేక పోయింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు వంట చేయలేదు. అంతేగాక వంటకు అవసరమైన పాత్రలు, వంట చెరుకు/గ్యాస్ ఇవ్వలేకపోయింది. దీంతో ఎలా వంట చేసి పెట్టాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల లేమి వేధిస్తోంది. మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టిసారించలేదు. ఇటువంటి సందర్భం లో ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
 కొన్నిచోట్ల అమృతహస్తం సరుకులతో...
 స్వతహాగా కొనుగోలు చేసిన సరుకులతో వంట చేసి చిన్నారులకు భోజనం పెట్టేంత స్తోమత తమకు లేదని కార్యకర్తలు, ఆయాలు అంటున్నారు. ఇటువంటి సమయంలో తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే అమృతహస్తం పథకం అమలవుతున్న మండలాల్లోని కొన్ని కేంద్రాల్లో మాత్రమే చిన్నారులకు సోమవారం వంట చేసి పెట్టారు. గర్భిణీలు, బాలింతలకు భోజనం అందించే సరుకులతో వీరికి వంట చేశారు. మిగిలిన ఒక్క కేంద్రాల్లో వంట చేయలేదు

మరిన్ని వార్తలు