భవనానికి "విశ్రాంతి"

25 Dec, 2016 00:19 IST|Sakshi
భవనానికి "విశ్రాంతి"

అనంతపురం అగ్రికల్చర్‌ : రైతుల కోసం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మించిన ‘రైతు విశ్రాంతి భవనం’ ప్రస్తుతం ఎందుకూ కొరవడకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 13ఏళ్లుగా భవనం విశ్రాంతి తీసుకుంటూనే ఉంది. అందులో ఒక్కరోజు కూడా రైతులు విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. భవనాన్ని 15ఏళ్ల క్రితం దాదాపు రూ.10లక్షలు వెచ్చించి అధికారులు నిర్మించారు. నిర్మించిన తర్వాత రెండేళ్లు అడపాదడపా వాడారు. ఆపై సమైఖ్యాంధ్ర ఉద్యమం సమయంలో స్పెషల్‌ పార్టీ పోలీసులకు.. ఇతర కార్యక్రమాలకు వాడుకున్నారు. నాటి నుంచి నేటి దాకా తిరిగి ఆ భవనాన్ని రైతుల కోసం ఉపయోగించుకోలేదు. ప్రస్తుత మార్కెట్‌ కమిటీ పాలక వర్గం, అధికారులతో పాటు ముందున్న వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో లక్షలు వెచ్చించి కట్టించిన విశ్రాంతి భవనం క్రమంగా పాడవుతోంది.

విశ్రాంతి భవనం ఉందనే విషయం కూడా తెలియనంతగా పర్యవేక్షణ కొరవడటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. కొన్నింటికి వాకిళ్లు, కిటికీలు కూడా పగులగొట్టారు. బాత్‌రూంలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక కొళాయిలు విరిగిపోయాయి. విశ్రాంతి భవనంలోపల, పరిసర ప్రాంతాల్లో మద్యం సీసాలు, ఇతరత్రా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. శని, ఆదివారం రోజుల్లో గొర్రెలు, మేకలు, పశువుల సంతలు జరగడం, ఇక రోజు వారీ పండ్ల మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు వస్తూ ఎండ, వాన, చలికి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి అందుబాటులోకి తేవాలని  కోరుతున్నారు.

మరిన్ని వార్తలు