నోట్ల రద్దు ఓ నాటకం

18 Dec, 2016 23:41 IST|Sakshi
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ విమర్శ
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు నోట్లను రద్దు చేసి నాటకం ఆడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ విమర్శించారు. కేంద్రంలోని మంత్రులు, వారి అనుకూల వ్యాపారులకు ఆర్‌బీఐ ప్రింటింగ్‌ ప్రెస్సుల నుంచే కొత్తగా ముద్రించిన నోట్లు వెళ్తున్నాయంటే ఎంతో లోపకారీ ఒప్పందాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతవరకు బ్యాంకుల ముందు పేదలే క్యూలలో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారని, ఒక్క ధనవంతుడు బ్యాంకు ముందు నిలబడ్డాడని ఆయన ప్రశ్నించారు. తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు, వయోజనులు, పేదలు నూరుమందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య భవన్‌లో టి. రమేష్‌కుమార్‌ అధ్యక్షత సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.   జిల్లాలో పార్టీ నిర్వహించిన పాదయాత్రల  సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలను రూపొందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కే.ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ.రాజశేఖర్, బీ.రామాంజనేయులు, పీఎస్‌ రాధాకృష్ణ పాల్గొన్నారు.  
>
మరిన్ని వార్తలు