ఇదో రకం ధనిద్రం

12 Dec, 2016 15:03 IST|Sakshi
ఇదో రకం ధనిద్రం
తమకో, తమ వారికో ఏదైనా జబ్బు వచ్చి, చికిత్సకు అవసరమైన డబ్బులు లేకపోతే పేదలు పడే బాధ జబ్బు బాధ కన్నా ఎక్కువేనని వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడలాంటి బాధను కొందరు డబ్బులుండి కూడా అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు, కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోట్లు రోగులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అత్యవసర సేవలకు రద్దయిన పెద్దనోట్లు ఈ  నెల 24 వరకూ చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, మందుల షాపుల యజమానులు వాటిని తీసుకోవడానికి తిరస్కరిస్తుండడంతో రోగుల బంధువులు అవస్థలు పడుతున్నారు. ఇక కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ. రెండు వేల నోటు తీసుకెళుతుంటే చిల్లర లేదన్న సమాధానమే వస్తోంది. దీంతో రోగులు, వారి బంధువులు ఉసూరుమంటున్నారు.
వ్యాధుల వ్యధకు తోడవుతున్న నోట్ల బాధ
రద్దయిన పెద్దనోట్లను తిరస్కరిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు 
కొత్త రూ.2000 నోటుకు దొరకని చిల్లర
ఆధార్‌ నకలు అందజేస్తేనే ఇస్తున్న బ్యాంకులు
సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఆస్పత్రుల్లో ఓపీ ఫీజులు రూ.100 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. రెండు వేల నోటు తీసుకుంటే మిగతా చిల్లర వందల రూపంలో ఇవ్వాల్సి వస్తుండడంతో ఆస్పత్రి సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఓపీ ఫీజు, బయట మందుల దుకాణంలో మందులు, రక్తపరీక్ష కేంద్రాల్లో ఫీజులు చెల్లించేందుకు రూ. రెండు వేల నోటు ఇస్తుంటే, వారు చిల్లర ఇవ్వాలని అడుగుతుండడంతో రోగులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అసలే ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళుతుంటే చిల్లర సమస్య వారిని మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. చేతిలో చెలామణి అయ్యే నగదు ఉన్నా వైద్యం చేయించుకోలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రెండువేల నోటుకు చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆస్పత్రిలోనే ఓపీ ఫీజు, పరీక్షలు, మందులు దొరికే విధంగా ఉన్న పరిస్థితుల్లో కొంత ఉపశమనంగా ఉంది. అలాంటి చోటఅన్నీ కలిపి ఒకే సారి బిల్లు చేసి రూ.రెండు వేల నోటు తీసుకుంటున్నారు.
బ్యాంకుకు వెళితే పూట పడిగాపులే..
రూ.100, 50, 20, 10 నోట్లు తగినంతగా అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. తమ వద్ద పాత నగదు ఉన్నా చెల్లకపోవడం, ఉన్న రెండు వేల నోటుకు చిల్లర లేకపోవడంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రద్దీ కారణంగా బ్యాంకుకు వెళ్లిన వారు రోజులో ఓ పూట అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న చిల్లర నోట్ల నిల్వలను అందరికీ పంచేందుకు ఒక్కొక్కరికీ రూ. రెండు వేలు మాత్రమే చిల్లర నోట్లు ఇస్తున్నారు. అదీగాక ఆధార్‌ నకలు ఇస్తేనే బ్యాంకులు రెండు వేల నోటుకు చిల్లర ఇస్తుండడం గమనార్హం. 
 
మరిన్ని వార్తలు