అక్రమాలు అనంతం

2 Nov, 2016 01:23 IST|Sakshi
అక్రమాలు అనంతం

నిజనిజాలు తేల్చకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్
సాక్షిలో వచ్చిన వాటిలో కొన్ని పేర్ల తొలగింపు
మిగిలినవి రాలేదు కదా అంటూ బుకాయింపు
కుమిలిపోతున్న అనంతవరం బాధితులు
పట్టించుకోని  సీఆర్‌డీఏ అధికారులు


రాజధాని గ్రామం అనంతవరంలో అక్రమాల నిగ్గుతేల్చకుండానే ప్లాట్ల కేటాయింపునకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో భూములను మాయం చేసి రాయించుకున్నవారు... భూమి లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సృష్టించుకున్నవారు మాత్రం దర్జాగా తిరుగుతుంటే.. భూములు పోగొట్టుకున్న బాధితులు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. మాయమైన తమ భూముల పరిస్థితి గురించి సీఆర్‌డీఏ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

అమరావతి బ్యూరో : రాజధాని నిర్మాణం కోసం దేశానికి అన్నం పెట్టే రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం వారికి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తడం లేదు. అధికార పార్టీ నేతల జేబులు నింపే విషయంలో వారికి పూర్తి మద్దతు ఇస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు చెందిన భూములు సెంట్ల రూపంలో మాయమైన బాగోతంపై సాక్షి వరుస కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 16న ‘రాజధాని గ్రామాల్లో అవినీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనంలో ప్రచురించిన పేర్లలో కొందరివి మాత్రం సరిచేశారు. పత్రికలో రాని పేర్లకు సంబంధించి ఏ ఒక్కరివీ సరిచేయలేదు. అదేమని అడిగితే..  ‘సాక్షిలో వచ్చినవి అవే కదా’ అంటూ సీఆర్‌డీఏ అధికారులు సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులపట్ల వివక్ష
రాజధాని కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా రుణం తీరదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూనే ఉన్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. వారికి సీఆర్‌డీఏ, రెవెన్యూ, పోలీసు శాఖలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రశ్నించిన వారిపై పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఒక్క అనంతవరంలో ఇంత పెద్దఎత్తున భూ కుంభకోణం జరిగితే... అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు పత్రికలో వచ్చినా.. లెక్కచేయకుండా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల భూములు తారుమారైన విషయాన్ని సాక్షి ఆధారాలతో వెలుగులోకి తెచ్చినా... సీఆర్‌డీఏ అధికారులు వాటిని సరిచేయకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక మర్మం దాగి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తుండడం    

గమనార్హం.
రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ రికార్డుల తారుమారు, భూమి లేకపోయినవారికి, ఉన్న మరికొందరికి అనూహ్యంగా రికార్డుల్లో అదనంగా నమోదైన భూముల వివరాలు ఇలా ఉన్నాయి...

మరిన్ని వార్తలు