నోటు పాట్లు.. గుండె పోట్లు

18 Dec, 2016 01:20 IST|Sakshi
నోటు పాట్లు.. గుండె పోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నాయి. బ్యాం కుల వద్ద క్యూలు మాత్రం తరగడం లేదు. ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో రెండు రోజులకు డబ్బులు అందుబాటులో ఉండవన్న భయంతో శనివారం చాలా బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనపడ్డాయి. క్యూలో నిలబడలేక గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిడమర్రు మండలం చానమిల్లికి చెందిన భీమాల కృష్ణమూర్తి (70) నగదు తీసుకునేందుకు గణపవరంలోని స్టేట్‌బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలబడగా, గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఖాతాదారులు, పోలీసులు ఆర్‌ఎంపీతో ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆయనను భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందుతున్నారు.
 
రోడ్డెక్కిన మహిళలు
బ్యాంకుల్లో నగదు లేదన్న బోర్డులతో మహిళలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇరగవరం ఎస్‌బీఐ వద్ద నగదు లేదని బోర్డు పెట్టడంతో బ్యాంకు ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో శనివారం ఉదయం 7 గంటలకే  ఆంధ్రాబ్యాంక్‌ వద్ద ఖాతాదారులు క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు నగదు లేదని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి లోనయ్యారు. బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించి 165 జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భీమవరం–పాలకొల్లు రహదారిలో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలో శనివారం బ్యాంకుల్లో  నగదు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్‌బీఐ ఏటీఎం మధ్యాహ్న నుంచి పని చేసినా..  మిగిలిన ఏటీఎంలు మూతపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో ఏటీఎంలు పని చేయలేదు. బ్యాంకుల్లో నగదు లేదు. ఆంధ్రాబ్యాంక్‌లో మాత్రం రైతులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కామవరపుకోట ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతాదారులకు చిల్లర పంపిణీ చేశారు. ఏటీఎంలు మాత్రం పని చేయలేదు. లింగపాలెంలో బ్యాంకుల్లో క్యాష్‌ లేదని చెప్పారు. ఏటీఎంలు పని చేయలేదు. నగదు ఇవ్వడం లేదని ప్రక్కిలంక స్టేట్‌బ్యాంక్‌ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాంక్‌ వద్దకు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు రాగా, రూ.వెయ్యి చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట ప్రాంతంలోని బ్యాంకుల్లో నాలుగైదు రోజుల నుంచి ఖాతాదారులకు టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం వెళ్లి క్యూలో నిలబడితే తప్ప టోకె¯ŒS దక్కే పరిస్థితులు లేకపోవడంతో తెల్లవారకుండానే బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. భీమవరం పట్టణంలో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం బారులు తీరి కనిపిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. జిల్లాలో కూడా దీనిపై ఊదరగొడుతున్నారు. అయితే, స్వైపింగ్‌ మెషిన్ల కోసం నెలరోజుల క్రితమే బ్యాంకర్లకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ ఇవ్వలేదు. 
 
మరిన్ని వార్తలు