చేతిరాత పాస్‌పోర్ట్ చెల్లదిక!

7 Oct, 2015 08:08 IST|Sakshi
చేతిరాత పాస్‌పోర్ట్ చెల్లదిక!

నవంబర్ 24 తర్వాత వీటిని అనుమతించరు

సాక్షి, హైదరాబాద్: చేతిరాతతో జారీ చేసిన పాస్‌పోర్ట్‌లు ఇకపై చెల్లుబాటు కావు. వాటిని తీసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే విదేశాలకు వెళ్లేందుకు చేతిరాత పాస్‌పోర్ట్‌లు అనుమతించరు. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) విదేశాంగ శాఖకు సూచించింది.

ఈ నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జారీ అయ్యే మెషిన్ రీడబుల్ (యంత్రాల ఆధారంగా రూపొందించిన) పాస్‌పోర్ట్‌లు పదేళ్ల కాలపరిమితికి ఇస్తున్నారు. 2001 ఏడాదికి ముందు హ్యాండ్ రిటన్ (చేతిరాత)తో పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. అప్పట్లో కొంతమంది 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారు. ఆ తరహా చేతిరాత పాస్‌పోర్ట్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్‌పోర్ట్‌లు 2015 నవంబర్ 24 వరకే చెల్లుబాటవుతాయి. ఆ తర్వాత వీటికి వీసా ఇవ్వడానికి నిరాకరిస్తారు.  
 
 ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవచ్చు..
 చాలా దేశాలు పాస్‌పోర్ట్ గడువు 6 మాసాల కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రయాణానికి అనుమతించవు. అందుకే పదేళ్ల పాస్‌పోర్ట్ కాలపరిమితిలో తొమ్మిదేళ్లు పూర్తవగానే రెన్యువల్ చేసుకోవాలి. పాస్‌పోర్టు బుక్‌లెట్‌లో 2పేజీలకి మించి లేకపోతే చాలా దేశాలు అనుమతించ వు. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారు జంబోబుక్‌లెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
 - అశ్విని సత్తారు,
 హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిణి

మరిన్ని వార్తలు